Telangana : తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? అదే జరిగిందంటే కష్టమేనా?
తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ మాత్రం కొట్టిపారేస్తుంది.;

తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశముందని అది అంచనా వేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సయితం ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నాయకులకు, క్యాడర్ కు సంకేతాలు పంపారంటే ఆయన పూర్తి ధీమాలో ఉన్నట్లు కనపడుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ గుర్తు అయిన కారుపార్టీ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ హైకోర్టు ను ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. సుప్రీంకోర్టు అనర్హత వేటు పది మంది ఎమ్మెల్యేలపై వేస్తే ఉప ఎన్నికలు రావడం ఖాయమని భావిస్తున్నారు.
నోటీసులు జారీ చేయడంతో...
ఈ నేపథ్యంలోనే బీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ సెక్రటరీకి గతంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మందికి నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి మారిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో త్వరలో మళ్లీ విచారణ ఉండటంతో అసెంబ్లీ సెక్రటరీ ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కారు పార్టీ నేతలు అంచనా వేసి అందుకు అనుగుణంగా క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు.
ఏడాది కావస్తుండటంతో...
తెలంగాణలో ఎన్నికలు జరిగి పదిహేడు నెలలు కావస్తుంది. అనేకహామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉందని బీఆర్ఎస్ భావిస్తుంది. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజల్లో ఈ రకమైన అసంతృప్తి తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే అంకెల పరంగా అనర్హత వేటు పడినా బీఆర్ఎస్ కు అదనంగా వచ్చే లాభమేదీ లేదు. కాంగ్రెస్ కు సంఖ్యాపరంగా జరిగే నష్టమూ లేదు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తి విషయం ప్రజాతీర్పు ద్వారా వెల్లడవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన నియోజకవర్గాల్లోనే ఉప ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వానికి నష్టం లేకపోయినా నైతికంగా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
సులువు కాదు...
కాంగ్రెస్ కు కూడా అంత సులువైన విషయం కాదు. పది నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ మారిన అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ మారినందుకు, తమ తీర్పును థిక్కరించి వారు వ్యతిరేకించినందుకు ప్రజలు సహజంగా వ్యతిరేకంగా ఉంటారు. పార్టీ మారిన వారికి కూడా కాకుండా కొత్త వారికి సీట్లు ఇచ్చే అవకాశం లేనందున ఇది కాంగ్రెస్ కు మైనస్ గానే చూడాలి. అదే సమయంలో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులకు అవకాశమిస్తే అది కొంత అనుకూలంగా మారే అవకాశముందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే దీనికి తెరపడనుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉప ఎన్నికలు రావంటూ ఆయన వ్యాఖ్యానించడం కూడా సంచలనమే అయింది. కోర్టులో కేసు ఉన్నప్పుడు రేవంత్ అంత ధీమాగా ఎలా మాట్లాడతారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్నదానిపై మాత్రం ఇంకా క్యాలిక్యులేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.