తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీకి మించి నేరచరితులు ఉన్నారు. అన్ని పార్టీల నుంచి మొత్తం 67 మంది నేర చరిత్ర ఉన్నవారేనని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది. వీరందరిపై సివిల్, క్రిమినల్ కేసులు ఉన్నాయని, సంస్థ కన్వీనర్ పద్మనాభ రెడ్డి వెల్లడించారు.
అన్ని పార్టీల్లో....
టీఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన 88 మంది ఎమ్మెల్యేలలో 44 మందిపై పలు కేసులు ఉన్నాయని, బీజేపీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎన్నో కేసులున్నాయని ఆయన అన్నారు. ఇక ప్రజాకూటమి నుంచి గెలిచిన 21 మందిలో 16 మందిపైనా, ఎంఐఎంకున్న ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై పెండింగ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల గురించి ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో కనీసం మూడు సార్లు ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఎవరూ పాటించలేదని ఆరోపించిన పద్మనాభ రెడ్డి, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.