రెండు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను ముప్పు.. ముంచుకొస్తోన్న మోచా
ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశా, ఏపీపై ఉండొచ్చని అభిప్రాయపడింది ఐఎండీ. గతేడాది మే నెలలో వచ్చిన అసని తుఫాను..
నడివేసవిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను చూస్తూ.. అన్నదాతలు లబోదిబోమంటు.. కంటతడి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు రైతన్న పై మరో పిడుగులాంటి వార్త పడింది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనుందంటూ ఐఎండీ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 9వ తేదీ నాటికి తుఫానుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ఏర్పడిన నేపథ్యంలో దానికి మోచా అని నామకరణం చేయనున్నారు.
ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశా, ఏపీపై ఉండొచ్చని అభిప్రాయపడింది ఐఎండీ. గతేడాది మే నెలలో వచ్చిన అసని తుఫాను సృష్టించిన బీభత్సం ఇంకా మరచిపోక ముందే.. ఈ ఏడాది మరో తుఫాను రానుండటం ఆందోళన కలిగిస్తోంది. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ రోజు విశాఖపట్నం, అనకాపల్లి, దువ్వాడ, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే కురిసిన వర్షాల ధాటికి కోతకు సిద్ధమైన వరిపంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పల్నాడు జిల్లాల్లో భారీ వర్షానికి కళ్లాల్లో వున్న వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. పొలాల్లో తడిసిన మిర్చి, మొక్కజొన్న పంటలను ఆరబెట్టుకునేందుకైనా వర్షం తెరపించడం లేదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.