నెల్లూరు పెద్దరెడ్లకు ఏమయింది?
నెల్లూరు జిల్లా నుంచి వైసీపీకి అసంతృప్తులు మొదలయ్యాయి. ఎంతగా అంటే పార్టీ నుంచి బయటకు వెళ్లేటంతగా.
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార వైసీపీలో అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. అది సహజమే. ముందుగానే ఊహించిందే. మంత్రి పదవులు దక్కకపోవడం, తాము ఆశించిన ప్రాధాన్యత లభించనప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీకి ఎన్నికల ముందు ఇటువంటివి మామూలే. కానీ నెల్లూరు జిల్లా నుంచే ఇది మొదలయింది. జగన్ సామాజికవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా పెద్దరెడ్లే ఇప్పుడు జగన్ కు ఇబ్బందిగా మారనున్నారు. సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ కు నెల్లూరు పెద్ద రెడ్లు మోకాలడ్డుతున్నారు.
వైసీపీకి కంచుకోట...
నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2014లోనూ అత్యధిక స్థానాలను ఆ జిల్లా నుంచి దక్కాయి. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీయే గెలిచింది. నెల్లూరు వైసీపీకి అంతగా అండగా నిలబడింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగులేదు. కానీ కొత్త ఏడాదిలో మాత్రం నెల్లూరు జిల్లా నుంచి వైసీపీకి అసంతృప్తులు మొదలయ్యాయి. ఎంతగా అంటే పార్టీ నుంచి బయటకు వెళ్లేటంతగా. ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి పార్టీపై తరచూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయనను వెంకటగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి తప్పించాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆయన తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసహనంతో ఉన్నారు.
ఆనం తర్వాత కోటంరెడ్డి...
అదే సమయంలో వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో ఆనం పార్టీ నుంచి వెళ్లిపోవడం గ్యారంటీ అయింది. ఇక తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన సోమవారం అంతా మండలాలు, వార్డుల వారీగా తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను అనుచరుల ఎదుట బయటపెట్టారు. పార్టీలో అవమానాలను ఇక భరించే పరిస్థితి లేదని భావిస్తున్నారు. ఎనీ టైం ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశముంది.
కోటంరెడ్డి గుడ్ బై...
మరోవైపు వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జిగా గిరిధర్ రెడ్డిని నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఉపేక్షించలేకపోతున్నానని, పార్టీలో కొనసాగే ప్రసక్తి లేదని తన అనుచరులకు చెబుతున్నట్లు తెలిసింది. దీంతో హైకమాండ్ అలర్ట్ అయి దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. నమ్మకమైన నేతగా వైసీపీకి ఉన్న కోటంరెడ్డి పార్టీని వీడటం బాధాకరమేనన్న కామెంట్స్ పార్టీ నుంచి వినపడుతున్నాయి. మొత్తం మీద వైఎస్ జగన్ కు నెల్లూరు నుంచే అదీ రెడ్డి సామాజికవర్గం నుంచే అసంతృప్తి మొదలయింది. ఎన్నికల సమయానికి ఇక ఎంతమంది ఇలా బయటపడతారో? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది.