కట్నం క్యాల్కులేటరా..సిగ్గుచేటు

Update: 2018-05-31 10:13 GMT

మీరు పెళ్లి వయస్సుకు వస్తే.. మీకు ఎంత మొత్తం కట్నాన్ని ఆశించవచ్చో తెలుసుకోండి.. అంటూ వచ్చిన డౌరీ క్యాల్కులేటర్ వెబ్ సైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఏకంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వయంగా స్పందించి ఈ వెబ్ సైట్ ను రద్దు చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి ఫిర్యాదు చేశారు. అసలు ఈ వెబ్ సైట్ ఏంటీ, ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చుద్దాం...

కట్నం..నేరమని తెలియదా..?

డౌరీక్యాల్కులేటర్.కామ్ పేరుతో ఉన్న ఈ వెబ్ సైట్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా సైట్లలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకసారి ఈ సైట్ లోకి వెళితే.. వరుడి వయస్సు, వృత్తి, కులం, రంగు, ఎత్తు, జీతం, తండ్రి వృత్తి వంటివి అడుగుతుంది. వీటన్నింటికీ జవాబు ఇస్తే వరుడు ఎంత కట్నం ఆశించవచ్చో చెబుతుంది. అన్నట్లు, ఇందులో మరో ప్రశ్న కూడా ఉంది. వరుడు ఇంతకుముందు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నాడో కూడా చెప్పాలి. అయితే, ఈ వెబ్ సైట్ రూపొందించిన వారికి ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. అసలు మనదేశంలో కట్నం తీసుకోవడం నేరం. మరి, ఈ విషయం తెలియకుండానే వెబ్ సైట్ రూపొందించారో ఏమో గానీ, మేనకా గాంధీ మాత్రం వెబ్ సైట్ ను బ్యాన్ చేయడంతో పాటు వెబ్ సైట్ రూపకర్తలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో ఈ వెబ్ సైట్ రూపకర్తలు ఇరుక్కుపోయి కష్టాలు తెచ్చుకున్నట్లే కనపడుతోంది.

Similar News