Weather Report : ఏపీకి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే... భారవర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం తుపానుగా మారనుంది
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం తుపానుగా మారనుంది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా మరొకసారి ప్రకటించింది. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. అవసరమైన ముందస్తు చర్యలు అన్నీ తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొనడంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు బితుకు బితుకుమంటూ బతుకీడుస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
ఈదురుగాలులు...
ఈ అల్పపీడనం రేపటికి పశ్చియ వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారి ఎల్లుండికి అదితుపానుగా మారనుందని వాతావరణ శాఖ తేల్చేసింది. ఈ తుపానుకు పేరును దానాగా కూడా పెట్టారు. దానా దూసుకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలును ఈ నెల 25న వీస్తాయని తెలిపింది. అదే సమయంలో ఉత్తరాంధ్రప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని మరోసారి హెచ్చరికలను జారీ చేసింది. ఈ తుపాను కారణంగా 24, 25 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
మత్స్యాకారులు తిరిగి రావాలి...
దీంతో పాటు చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈరోజు తిరిగి వచ్చేయాలని కోరారు. రేపటి నుంచి మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటను నిషేధిసతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండిపోయి ఉండటంతో వాటి కింద ఉన్న ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు తరలి రావాల్సి ఉంటుందని ప్రకటించారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అలజడిగా ఉంటుందని చెప్పారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అమరావతి నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.