పెద్దిరెడ్డి కి జగన్ ఓకే చెప్పారట
ఆర్థికంగా, క్యాడర్ పరంగా, సామాజికపరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీని చిత్తూరు జిల్లాలో బలోపేతం చేస్తున్నారు.
ఏ పార్టీలో నైనా నాయకుడు రిజల్ట్ చూపినప్పుడే సత్తా బయటపడుతుంది. అప్పుడే ఆయనకు పార్టీలో ఉన్న స్థానాన్ని తెలియపరుస్తుంది. ఇప్పుడు వైసీపీలో సరైన నేత ఎవరైనా ఉన్నారంటే ఠక్కున వినపడే పేరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన వైసీపీకి అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు. ఆర్థికంగా, క్యాడర్ పరంగా, సామాజికపరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారు. అదీ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో పెద్దిరెడ్డి ప్రయారిటీ మరింత పెరిగింది.
ఏ ఎన్నికలో అయినా?
ఏ ఎన్నికయినా పెద్దిరెడ్డి ఇన్ ఛార్జిగా ఉన్నారంటే అక్కడ గెలుపు తధ్యమన్నది పార్టీ అధినేతకు కూడా విశ్వాసం. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఏ ఎన్నికయినా చిత్తూరు జిల్లాలో వరస గెలుపులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రాధాన్యత మరింత పెరిగింది. కుప్పం మున్సిపాలిటీని ఓడించి చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడంతో పెద్దిరెడ్డిని జగన్ మరింత నమ్ముతున్నట్లే కన్పిస్తుంది. ఆయనకు మరో కీలక బాధ్యతను అప్పగించే పనిలో జగన్ ఉన్నారు.
కుప్పం నుంచి....
వచ్చే ఎన్నికలు జగన్ కు కీలకం. అలాగే చంద్రబాబుకు కూడా. ఇప్పటికే వైసీపీ కుప్పం పై దృష్టి పెట్టింది. అక్కడ ఇన్ ఛార్జి భరత్ ను ఎమ్మెల్సీని చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహం ఎలా ఉండనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం కు కట్టడి చేయాలన్నది వైసీపీ ప్లాన్ గా ఉంది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబంలోనే ఒకరికి కుప్పం టిక్కెట్ ఇవ్వాలన్నది దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం.
గట్టి పోటీ....
పెద్దిరెడ్డి కుటుంబంలోని సుధీర్ రెడ్డికి కుప్పం టిక్కెట్ ఖరారు కావచ్చు అన్న టాక్ నడుస్తుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబానికి మూడు టిక్కెట్లు గత ఎన్నికల్లో ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. సోదరుడు ద్వారకానాధరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. నాలుగో సీటు సుధీర్ రెడ్డికి ఇస్తారన్న టాక్ విన్పిస్తుంది. సుధీర్ రెడ్డి పెద్దిరెడ్డి మరో సోదరుడి కుమారుడు. ఆయనైతేనే చంద్రబాబును కుప్పంలో కట్టడి చేయవచ్చన్న అంచనాలో వైసీపీ ఉంది. అయితే వరస గెలుపులతో ఉన్న చంద్రబాబును కుప్పంలో ఓడించడం సాధ్యమా? లేదా? అన్నది పక్కన పెడితే సుధీర్ రెడ్డి బరిలోకి దిగితే కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశముందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. జగన్ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం.