కవిత ఇరుక్కున్నారా? ఇరికించేశారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రకటించారు;
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ లింకులు బయటపడినప్పుడే కవిత పేరు లీకయింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు కవిత పేరు వినిపిస్తూనే ఉంది. కానీ తాజాగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఆమె పేరును పేర్కొనడంతో మరోసారి కవిత టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. కవిత ఈ ప్రాంత మద్యం వ్యాపారులను ఒక్కటిగా చేసి ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పాలసీని మార్చి...
ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చేలా చేసింది కూడా మద్యం వ్యాపారులేనన్నది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదన. గతంలో సర్కార్ మాత్రమే మద్యం దుకాణాలను నిర్వహించేది. అయితే ఆ పాలసీని మార్చి ప్రయివేటు వ్యాపారులకు మద్యం దుకాణాలను అప్పగించాలని పాలసీని మార్చారు. మొత్తం 32 సర్కిళ్లలో 9 సర్కిళ్లలో మద్యం వ్యాపారాన్ని మనోళ్లు చేజిక్కించుకునే ప్రయత్నించాశారన్నది ప్రధాన ఆరోపణ. ఇందుకు గాను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు వంద కోట్ల ముడుపులు సమర్పించారని ఈడీ, సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. కవిత తన ఫోన్లను పది సార్లు ధ్వంసం చేశారని కూడా ఆరోపించారు.
కొందరి అరెస్ట్...
ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అరెస్ట్ చేస్తారన్న వదంతులు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. అయితే తమకు ఏమాత్రం సంబంధం లేదని వారు చెబుతున్నారు. కవిత పాత్ర ఎంత ఉంది? అసలు ఉందా? లేదా? అన్న విషయాలను పక్కన పెడితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు ఎన్ని సక్సెస్ అవుతున్నాయన్నదే ప్రశ్న. ఈడీ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్కరికీ శిక్ష పడిన దాఖలాలు కూడా లేవన్నది న్యాయ నిపుణులు చెబుతున్న మాట.
ఈ నెల 8 తర్వాత?
అంతేకాదు...తప్పు నిజమే కావచ్చు. చట్టబద్దమైన తప్పే కదా? అనే వారు లేకపోలేదు. ప్రభుత్వ పాలసీని ఎవరు ప్రశ్నిస్తారు. పాలసీని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పాలసీలను మార్చుకోకూడదా? అయినా ఇందులో ఆధారాలను ఎలా నిరూపించగలుగుతారన్నది నిపుణులు నిలదీస్తున్నారు. సాక్షాధారాలను బట్టే కోర్టు నిర్ణయాలుంటాయి. తీర్పులుంటాయి. కాకుంటే రాజకీయంగా కొన్నాళ్లు బద్నాం చేయడానికి మాత్రం ఇవి ఉపయోగపడతాయి. కవితను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్ట్ చేయవచ్చు అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కోర్టు తీర్పులేమో కాని ప్రజాతీర్పులో తేడా రాకుండా చూసుకోడానికే నేతలు ఎక్కువగా శ్రమిస్తారు. మొత్తం మీద ఈ నెల 8వ తేదీ తర్వాత ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.