Tirupathi : తిరుపతి ఘటన ప్రమాదమా? కావాలని చేసిందా? పోలీసుల ఆరా
తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ విషాద ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని చెబుతున్నారు;
తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ విషాద ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని చెబుతున్నారు. ఒక్కసారి గేట్లు తెరవడంతో తోపులాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తప్పిదం కూడా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అసలు 1.20 లక్షల టోకెన్లు ఒకేరోజు జారీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. విడతల వారీగా టోకెన్లు ఇవ్వడమే కాకుండా, వైకుంఠ ద్వార దర్శనం రోజుల సంఖ్య కూడా పెంచితే ఇంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చే వారు కాదంటున్నారు. ఒక్కరోజులో 1.20 లక్షల టోకెన్లు జారీ చేసి, మరుసటి రోజు నుంచి నలభై వేల టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించినా భక్తులకు అది చేరలేద.
పది రోజులు మాత్రమే కావడంతో...
రోజుకు 70 వేల మందినే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పడంతో పాటు ద్వార దర్శనం రోజుల కుదింపు కూడా ఈ తొక్కిసలాటకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఆయాసంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలికి సాయం చేయడానికి గేటు తెరవడంతోనే ఒక్కసారిగా భక్తులు తోసుకు వచ్చారంటున్నారు. పది రోజులు మాత్రమే ద్వార దర్శనాలు ఉండటంతో టోకెన్లు దొరకవమేమోనన్న ఆందోళనతో భక్తులు తోపులాటకు పాల్పడ్డారన్నారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం కూడా ఆరుగురు మృతి చెందడానికి ఒక కారణంగా చెబుతున్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు విచారణ జరపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు కారణమా?
తొక్కిసలాటకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరో వాదన కూడా వినపడుతుంది. తొక్కిసలాటకు ఇద్దరు వ్యక్తుల కారణమని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారుఎవరనేది పోలీసులు , టీటీడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు ఉద్దేశ్యపూర్వకంగా పాల్పడ్డారని అనుమానం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది దూరంలో కేకలు అరుపులతో దుమారంలేపి ఒక్కసారిగా భక్తులను ముందుకు నెట్టింది ఎవరు అన్న దానిపై అధికారులు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న టీటీడి అధికారులు , అన్ని వైపుల నుండి భక్తులను ఆరా చేస్తూ సి సి ఫుటేజ్ ల ఆధారంగా ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నారు. ఘటనలో మొదటి వరుసలోని భక్తుల తీవ్ర ఆగ్రహం కావాలనే వెనుక నుండి తోపులాట చేసి తొక్కిసలాటకు పాల్పడ్డారని కొందరు వ్యక్తం చేశఆరు.
ఒక్కసారిగా గేటు తెరవడంతోనే...
అయితే వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో జరిగిన తోపులాటపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటర్లో డీఎస్పీ గేట్లు తెరిచారన్నారు. దీంతో తొక్కిసలాట జరిగిందని, మొత్తం ఆరుగురు భక్తులు చనిపోయారని తెలిపారు. దాదాపు యాభై మంది వరకూ గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అయితే నేడు చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్లనున్నారు. గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఇప్పటికే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.