రేవంత్ ను రవ్వంత కూడా కదపలేరా?

నిన్న ప్రకటించిన పీసీసీ కమిటీల్లోనూ రేవంత్ రెడ్డి సూచించిన వారికే ఎక్కువ పదవులు వచ్చాయి

Update: 2022-12-11 04:06 GMT

కాంగ్రెస్ ఇంతకు ముందుగా లేదు. హైకమాండ్ కొంత రాష్ట్ర ఇన్‌ఛార్జులకు ఫ్రీ హ్యండ్ ఇస్తుంది. గతంలో మాదిరి ఢిల్లీ నుంచి పెత్తనం చేయడానికి కొంత వెనకాడుతుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో డ్యామేజీకి కారణం ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాలే కారణమని ఆలస్యంగా గ్రహించినట్లుంది. అందుకే రాష్ట్ర పార్టీకి పూర్తి బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లుంది. అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలి తప్పించి తరచూ వారి నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని నిర్ణయించుకున్నట్లుంది. తెలంగాణ పీసీసీ కమిటీల నియామకం కూడా ఇందుకు అద్దం పడుతుంది.

కాంగ్రెస్ లో విభేదాలు...
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడం లేదు. ఇక్కడ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, గెలిచిన కొద్దిమందీ పార్టీని వీడి వెళుతుండటం, నాయకుల మధ్య కొట్లాటలు వంటి కారణాలతో పార్టీ పట్ల ప్రజలు దూరం జరిగారు. నాయకత్వాన్ని బలహీనపర్చే కార్యక్రమాన్ని సొంత పార్టీ నేతలే చేస్తుండటం కూడా ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఏ పీసీసీ చీఫ్ ను ప్రశాంతంగా తన పని తాను చేసుకోనివ్వరు. ప్రతి ఒక్కరూ పెత్తనం చేయాలని చూస్తారు. ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఏకపక్ష నిర్ణయమంటూ వీధికెక్కుతారు. దీంతో కాంగ్రెస్ జనాదరణ కోల్పోవాల్సి వస్తుంది.

ఫిర్యాదులు చేసినా...
అయితే తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా అనేకమంది ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు. వచ్చే ఎన్నికలకు రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉండకూడదని కొందరు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ హైకమాండ్ మాత్రం వారి ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదు. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడి వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. సీనియర్లు కాళ్లకు అడ్డంపడుతున్నారని గ్రహించి వారి అరుపులకు పెద్ద విలువ ఇవ్వకుండా కాంగ్రెస్ హైకమాండ్ విని ఊరుకుంటుంది. ఎంతకాలమని ఢిల్లీచుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. ఇక రేవంత్ నేతృత్వంలోనే పనిచేయాలని హైకమాండ్ పరోక్షంగా సంకేతాలను కూడా పంపింది.
రేవంత్ సూచించిన వారికే...
నిన్న ప్రకటించిన పీసీసీ కమిటీల్లోనూ రేవంత్ రెడ్డి సూచించిన వారికే ఎక్కువ పదవులు వచ్చాయి. ఆయన వర్గానికే ఎక్కువ పదవులు రావడంతో హైకమాండ్ ఆలోచన ఏంటో చెప్పకనే చెప్పినట్లయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. రానున్న కాలంలో రేవంత్ రెడ్డికి మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, పార్టీలో వినిపించే విమర్శలను పెద్దగా పట్టించుకోవద్దని రేవంత్ కు ఇప్పటికే అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు తెలిసింది. మొత్తం మీద రేవంత్ రెడ్డికి రానున్న కాలంలో మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లుంది.


Tags:    

Similar News