ఢిల్లీలో ఢోకాలేని బాబు.. వైసీపీ అట్టర్ ప్లాప్

చంద్రబాబు ఢిల్లీ వెళ్లకపోయినా ఆయన తన నమ్మకస్థులైన అధికారులను మాత్రం ముఖ్యమైన పోస్టుల్లో నియమించుకుంటున్నారు

Update: 2022-08-11 03:39 GMT

chandrababu naidu 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో పరపతి తగ్గిందని ఎవరన్నారు? ఆయన ప్రభ ఇంకా కొనసాగుతుంది. ఆయన అనుకూలురైన అధికారులు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పోస్టులలో నియమితులవుతున్నారు. దీని వెనక ఎవరున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న లాబీయింగ్ కారణంగానే ముఖ్యమైన పోస్టుల్లో ఉన్నతాధికారులుగా తనకు అనుకూలురైన, తన సామాజికవర్గానికి చెందిన నేతలే అపాయి‌ంట్‌మెంట్ కావడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఢిల్లీలో లాబీయింగ్ చేయడంలో అట్టర్ ప్లాప్ అయిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.

ఆయనకు అనుకూలురైన...
కేంద్ర దర్యాప్తు సంస్థల్లో చంద్రబాబు అనుకూలురైన వారు నియమితులు కావడంపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదనపు డైరెక్టర్ గా దినేష్ పరుచూరి నియమితులయ్యారు. ముఖ్యమైన కేసులను డీల్ చేస్తున్న అభిషేక్ గోయల్ ను ఆకస్మికంగా బదిలీ చేసి ఈడీలో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారిని నియమించడం వెనక జరిగిందేంది? అన్నది ఆసక్తికరంగా మారింది. దినేష్ పరుచూరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ట్రాన్స్‌కో జేఎండీగా పనిచేశారు. అయితే కీలక పోస్టుల్లో చంద్రబాబుకు విశ్వాసపాత్రులు, ఆయన సామాజికవర్గానికి చెందిన అధికారులు నియమితులు కావడం వెనక ఢిల్లీలో పెద్ద లాబీయింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
సుజనా చౌదరి లాబీయింగ్ తో...
ప్రధానంగా మాజీ ఎంపీ సుజనా చౌదరి నేరుగా లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి బీజేపీలో ఉన్నా ఆయన ఆసక్తి అంతా తెలుగుదేశం పార్టీపైనే ఉంటుంది. చంద్రబాబుకు చిన్నపాటి సమస్య వచ్చినా సుజనా విలవిలలాడిపోతాడు. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో చేరింది బీజేపీపై ప్రేమతో కాదు. చంద్రబాబుకు మేలు చేకూర్చడంకోసమే. ఆయన తనకు రాజ్యసభ పదవి బీజేపీ రెన్యువల్ చేయకపోయినా చంద్రబాబు కోసమే ఢిల్లీలో ఉన్నారు. అంతేకాకుండా సుజనా చౌదరికి పరోక్షంగా ఢిల్లీలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తుల సహకారం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ చంద్రబాబు సామాజికవర్గం కావడంతో ఆయనకు రక్షణ కవచంగా అధికారుల వ్యవస్థను తాము పదవుల్లో ఉన్నప్పుడే ఏర్పరచే ప్రయత్నం చేస్తున్నారని టాక్.
వైసీపీ ప్రయత్నాలు....
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరి నియామకం ఆ కోవలో జరిగిందే. అయితే ఈయన రాకను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసినా పెద్దల లాబీయింగ్ ముందు వీరి ప్రయత్నాలు ఫలించలేదు. కస్టమ్స్ సిజీఎస్టీ విభాగం అధికపతిగా శివనాగకుమారి ఉన్నారు. ప్రతి కేసు కూడా జీఎస్టీ సమాచారంతోనే ప్రారంభం కావడంతో ఇది కూడా కీలక పదవే. కస్టమ్స్ అదనపు డైరెక్టర్లుగా దొంతి గాంధీ, వెంకయ్య చౌదరిలు నియమితులయ్యారు. ఇలా చంద్రబాబుకు అనుకూలురైన అధికారులను వరసగా తెలుగు రాష్ట్రాలకు తేవడంలో భారీ వ్యూహం ఉన్నట్లు కనపడుతుంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లకపోయినా ఆయన తన నమ్మకస్థులైన అధికారులను మాత్రం ముఖ్యమైన పోస్టుల్లో నియమించుకుంటున్నారు. ఇక ఎవరన్నారు? చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పడం లేదని? ఎవరన్నారు ఢిల్లీలో చంద్రబాబుకు పరపతి లేదని? ఈ ఉదాహరణ చాలదా? ఏతా వాతా తేలేదేంటంటే జగనన్నకు కష్ట సమయంలో మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేందుకు వీరంతా ఇతోధికంగా పనిచేస్తారన్నది మాత్రం వాస్తవం.


Tags:    

Similar News