నారా లెక్క క్లియర్.. అందుకే కన్నా ఎంట్రీ
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది.
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఈ నెల 23, 24 తేదీల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టమయింది. వచ్చే ఎన్నికల్లో తమతో బీజేపీ పొత్తు పెట్టుకోదని టీడీపీ అధినేత చంద్రబాబు భావించినట్లుంది. అందుకనే ఆయన చేరికకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటున్నారు. సాధారణంగా బీజేపీతో పొత్తు కుదురుతుందని భావిస్తే చంద్రబాబు బీజేపీ నేతలను పార్టీలోకి తీసుకోరు.
కమలం పార్టీ నేతలకు కండువా...
పార్టీలోకి బీజేపీ నేతలను తీసుకుని ఎన్నికలకు ముందు కమలంతో కయ్యానికి దిగేంత సీన్ టీడీపీ అధినేతకు లేదు. ఆయన చివరి నిమిషం వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కొనసాగాలనే కోరుకుంటారు. అందుకే ఆచి తూచి అడుగులు వేసే చంద్రబాబు బీజేపీ నేతల మెడలో పసుపు కండువా కప్పే సాహసం చేయరు. అది చేస్తున్నారంటే బీజేపీ తమను దగ్గరకు రానివ్వదన్న స్పష్టత వచ్చినట్లేనని భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి కావచ్చు.. జరుగుతున్న పరిణామాలు కావచ్చు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన,కమ్యునిస్టులు మాత్రమే కలసి వెళ్లాల్సి ఉంటుందని ఆయన డిసైడ్ అయ్యారని కన్నా లక్ష్మీనారాయణ పరిణామాన్ని బట్టి తెలుస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పవన్ కు కళ్లెం వేయడానికి...
అందుకే కన్నా లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుంటే కొంత అడ్వాంటేజీ ఉంటుందని చంద్రబాబు భావించి ఉండవచ్చు. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తో సీట్ల ఒప్పందం జరిగేటప్పుడు కన్నా పనికివస్తారని భావించి ఉంటారని అనుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సీట్లు కోరినా, సీఎం పదవి పవన్ ఆశించినా కన్నా ద్వారా పవన్ ను బుజ్జగించే వీలుంటుందని ఆయన నమ్మారు కాబట్టే కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధపడ్డారు. నిజానికి కన్నాను పార్టీలో చేర్చుకోవడం గుంటూరు జిల్లా నేతలు ఎవరికీ ఇష్టం లేదు. పార్టీలో కన్నా పెత్తనాన్ని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికీ తట్టుకోలేమని, ఊహించుకుంటూ ఆందోళన చెందుతున్నారు.
సీనియర్ నేతలు అసంతృప్తి చెందినా...
రాయపాటి సాంబశివరావు కుటుంబం కూడా కన్నాచేరికతో పార్టీకి దూరమయ్యే అవకాశముంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు కూడా కన్నా ఎంట్రీని మనస్ఫూర్తిగా స్వాగతించరన్నది వాస్తవం. అయినా చంద్రబాబు కన్నాకు ఓకే చెప్పడం వెనక.. ఆయన వల్ల కొంత కాపు ఓటు బ్యాంకు జిల్లాలో పార్టీకి ప్లస్ గా మారుతుందని లెక్కలు వేశారట. అలాగే పవన్ ఏ మాత్రం తోక జాడించినా కన్నాతో చెక్ పెట్టవచ్చన్న వ్యూహమూ కావచ్చు. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలో చేర్చుకుంటే మాత్రం చంద్రబాబు లెక్కలన్నీ క్లియర్ గానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎలాగైనా రావాలనుకుంటున్న చంద్రబాబు కన్నా లాంటి వారికి కండువా కప్పేందుకు సిద్ధపడ్డారంటే కొందరిని వదులుకోవడానికి, మరికొందరికి కళ్లెం వేయడానికేనంటూ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న ఇన్నర్ వర్గాల టాక్.