చిన్నమ్మకు నో ఎంట్రీ.. మరో మార్గముందా?

పళనిస్వామి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని పన్నీర్ సెల్వం కు అప్పగిస్తుండటంతో ఇక శశికళకు పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదు

Update: 2021-12-06 06:58 GMT

తమిళనాట రాజకీయాలకు ఎప్పుడూ కొదవలేదు. డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఒకవైపు ప్రజల్లోకి వెళుతుంటే విపక్ష అన్నాడీఎంకే మాత్రం ఓటమి తర్వాత ఏమాత్రం కోలుకోలేదు. పరవాలేదనిపించే స్థానాలను సాధించిన అన్నాడీఎంకేలో ఇప్పుడు శశికళ ఫీవర్ పట్టుకుంది. శశికళ తాను తిరిగి అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన చిన్నమ్మ మళ్లీ రెండాకులను చేతుల్లోకి తెచ్చుకునేందుకు శ్రమిస్తున్నారు.

ఇద్దరి మధ్య...
అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ముఖ్య నేతలుగా ఉన్నారు. వారిలో చీలిక తెస్తే ఖచ్చితంగా పార్టీ తన చేతుల్లోకి వస్తుందని శశికళ భావించారు. ఒక దశలో ఆమె ప్రయత్నాలు ఫలించినట్లే కన్పించాయి. పన్నీర్ సెల్వం సయితం శశికళ రాకను ఆహ్వానించారు. దీంతో శశకళ రీఎంట్రీ సులువుగానే ఉంటుందని భావించారు. కానీ శశికళ వస్తే తనకు పార్టీలో ముప్పు తప్పదని భావించిన పళనిస్వామి తొలి నుంచి ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారు.
గ్యాప్ ఉన్నా...
అయితే తాజాగా జరిగిన పరిణామాలు శశికళను పార్టీ కార్యాలయంలో కాలు మోపకుండా చేసేందుకేనన్నది స్పష్టంగా తెలుస్తోంది. తొలి నుంచి పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య కొంత గ్యాప్ ఉంది. ముఖ్యమంత్రి పదవి తనకు దక్కలేదన్న అసంతృప్తి పన్నీర్ సెల్వలంలో ఉంది. అలాగే పార్టీ పైన పెత్తనం చేయాలన్న ఆలోచన పళనిస్వామికి ఉంది. శశికళ మధ్యలో రావడంతో పళనిస్వామి కొంత వెనకడుగు వేయక తప్పలేదు.
పార్టీ బాధ్యతలను...
అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా పన్నీర్ సెల్వం ఉండేందుకు పళనిస్వామి అంగీకరించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. పార్టీ చీఫ్ గా పన్నీర్ సెల్వం, డిప్యూటీ చీఫ్ గా పళనిస్వామి ఉండనున్నారు. ఇక ఎన్నికలు ఏకగ్రీవంగా జరగనున్నాయి. పళనిస్వామి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని పన్నీర్ సెల్వం కు అప్పగిస్తుండటంతో ఇక శశికళకు పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదు. పార్టీ ఈ ఇద్దరి నేతల చేతుల్లోనే ఉండనుంది. శశికళకు ఇక నిరాశే ఎదురుకానుంది. అయితే శశికళ మరో మార్గంలో పార్టీలోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమనే వారు కూడా లేకపోలేదు.


Tags:    

Similar News