ఊహించిందే.. ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతారని దాదాపు ఏడాది ముందు నుంచే ప్రచారం జరుగుతుంది.
సాధారణంగా నిందలు వేయడానికి.. తప్పించుకోవడానికి సాకులు వెతుకుతుంటారు. చెప్పే సాకులు వినసొంపుగానే ఉన్నా వారి నిర్ణయం ముందుగానే తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో అంచనాలు సాధారణంగా తప్పవు. జరుగుతున్న విషయాలను చూసి అంచనాలు వేయవచ్చు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతారని దాదాపు ఏడాది ముందు నుంచే ప్రచారం జరుగుతుంది. ఆయన ఇంటి ఎదుట బీజేపీ బ్యానర్లు తొలగించినప్పుడే ఆయన మనసులో పార్టీని వీడేందుకు సిద్ధమవ్వాలని బీజం పడిందని అందరికీ తెలిసిందే.
రాజకీయ భవిష్యత్ కోసం...
కాకుంటే కొంత కాలం ఆగడం రాజకీయ నేతలకు ఎవరికైనా అలవాటే. సోము వీర్రాజు మీద ఆరోపణలు చేయడం ఒక సాకు మాత్రమే. కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడింది సోము వీర్రాజు కొరుకుడు పడక కాదు. బీజేపీ మీద అవాజ్యమైన ప్రేమ కారిపోతూ, దానిని చంపుకుని మరీ ఆయన పార్టీని వీడలేదు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసమే పార్టీని వీడారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. జనసేనతో కలసి పోటీ చేసినా పెద్దగా ఫలితం లేదు. జనసేన, టీడీపీలలో ఏదో ఒకదానిలో చేరితేనే తాను మరోసారి శాసనసభలోకి అడుగుపెట్టగలనన్నది ఆయన విశ్వాసం.
అన్నీ నిర్ణయించుకున్న తర్వాతే...
అందుకే ఆయన సమయం కోసం వేచి చూశారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. సోము వీర్రాజు పై ఆరోపణలు ఒక కారణం మాత్రమే. ఆయన ముందుగానే తన మార్గాన్ని ఎంచుకున్నారు. ఏ పార్టీలో చేరాలో? 2024లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో ముందే నిర్ణయించుకున్నారు. దశాబ్దాల కాలం పాటు రాజకీయాలు నెరిపిన కన్నా లక్ష్మీనారాయణ ఆ మాత్రం ఆలోచించకుండా మోదీ మీద ప్రేమ ఉన్నా పార్టీ సోము వీర్రాజు కోసమే మారుతున్నారంటే వినేవాళ్లు అంత రాజకీయ అజ్ఞానులు కాదు. ఆయన అన్నీ ఆలోచించుకునే రాజీనామా చేశారు.
ఎక్కడకు వెళ్లాలో...
రాజీనామా చేస్తే ఆయన ఎక్కడకు వెళ్లాలో ముందే తెలుసు. కాకుంటే అనుచరులతో చర్చించి నిర్ణయించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పడమూ ఒక తంతు. అంతే అది ముందే డిసైడ్ అయిపోయింది. ఆయన వచ్చే ఎన్నికల్లో శాసనసభలోకి అడుగుపెట్టాలనుకున్నారు. బీజేపీలో ఉంటే అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే పార్టీ మారాలన్న ఆలోచన 2019 ఎన్నికల తర్వాత వచ్చిందన్నది ఆయనకు అత్యంత సన్నిహితులే అంగీకరిస్తారు. కన్నా లక్ష్మీనారాయణ ఎగ్జిట్ కూడా బీజేపీ పెద్దలకు పెద్దగా ఆశ్చర్యం కలగకపోవచ్చు. ముందుగా ఊహించిందే. అందుకే కన్నా పార్టీని వీడి వెళ్లినా ఆ పార్టీకి పెద్దగా జరిగే లాభం లేదు. నష్టం లేదు. అలాగే కన్నా లక్ష్మీనారాయణకు కూడా అదే కావాలి. త్వరగా బయటపడి తాను రాజకీయంగా యాక్టివ్ కావాలి. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోక తప్పింది కాదు.