ముద్రగడ ను ముగ్గులోకి దింపబోతున్నారా?
వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు పోటీగా ముద్రగడను వైసీపీ రంగంలోకి దించబోతుందా? కాపు సామాజికవర్గం ఓట్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. ముద్రగడ లేదా ఆయన కుటుంబం నుంచి ఒకరిని వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందనే చెప్పాలి. కాపు సామాజికవర్గం వరస సమావేశాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముద్రగడను తిరిగి రాజకీయ ముగ్గులోకి దింపే ప్రయత్నం జరుగుతన్నట్లే కనపడుతుంది.
అనేక మంది ఉన్నా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజివకర్గం బలమైనది. పవన్ కల్యాణ్ వెంట కాపు సామాజికవర్గం మొత్తంగా నడిచే పరిస్థితులు ఉండకూడదు. ముద్రగడను, పవన్ ను పక్కన పెట్టి చూస్తే కాపు వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ ఖచ్చితంగా ముద్రగడే అవుతారు. మరోవైపు వంగవీటి రంగా తనయుడు రాధా టీడీపీలో ఉన్నప్పటికీ ఆయనకు కూడా కాపు సామాజికవర్గంలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆయనను తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఈ లెక్కలతోనే ముద్రగడ కుటుంబాన్ని వైసీపీ తరుపున బరిలోకి దించాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. కన్నా లక్ష్మీనారాయణ వంటి వాళ్లు కూడా కాపు నేతగా ముద్రవేసుకునేందుకు తపన పడుతున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కన్నా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు కూడా. ఎవరు ఎన్ని చేసినా కాపు కులంలో మాత్రం ముద్రగడకు ఉన్న ఐడెంటిటీ మరే నేతకు లేదనే చెప్పాలి.
ఏ పదవి ఇచ్చేందుకైనా...
ముద్రగడకు అవసరమైతే రాజ్యసభ పదవి ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సీటు కావాలన్నా ఇచ్చేందుకు రెడీగా ఉంది. మరోవైపు ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తే ఆయన కుమారుడికి తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చేందుకు అధికార వైసీపీ మొగ్గు చూపుతుంది. ఏది కావాలో అది ముద్రగడ కుటుంబానికే ఆ పార్టీ నేతలు వదిలేసినట్లు కనపడుతుంది. చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు.
సెకండ్ ఇన్నింగ్స్ ను...
కానీ తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఆయన తలొగ్గే అవకాశముందన్న సూచనలు కనిపస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆయన జగన్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుందామని, ముందుగా వచ్చి ఇతరులకు అవకాశం ఇవ్వకూడదన్న ధోరణిలో ముద్రగడ ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. అదే జరిగితే కాపు ఓట్లను చేజిక్కించుకునేందుకు వచ్చే ఎన్నికల్లో ముద్రగడ vs పవన్ కల్యాణ్ గా మార్చాలన్న యత్నంలో అధికార వైసీపీ ఉంది. మరి ముద్రగడ చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. కిర్లంపూడికే పరిమితమవుతారా? లేదా కాపు కార్డుతో పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారా? అనేది చూడాల్సి ఉంది.