కల్వకుంట్ల కుటుంబం నుంచి తొలిసారి

కేసీఆర్ కుటుంబం నుంచి తొలిసారి కల్వకుంట్ల కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-03-11 07:11 GMT

అది నిజమైనా.. అబద్ధమైనా... కేసీఆర్ కుటుంబం నుంచి తొలిసారి కల్వకుంట్ల కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. అదీ లిక్కర్ స్కామ్ లో. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై అనేక కేసులు నమోదయ్యాయి. అది ఉద్యమ సమయంలో కాబట్టి ప్రజలు కూడా అంతగా పట్టించుకోలేదు. గతంలోనూ కేసీఆర్ పై పాస్‌పోర్టుల కుంభకోణం ఆరోపణలు వచ్చినా అవేమీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కొనలేదు. 2014లో అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత విపక్షాలు అనేక అవినీతి ఆరోపణలు చేశాయి.

గతంలో ఇలాంటి ఘటనలు...
కానీ వేటి మీద ఇంత వరకూ దర్యాప్తు చోటు చేసుకోలేదు. 2018 ఎన్నికల సమయం ముందు వరకూ అవినీతి ఆరోపణలు వచ్చినా ఇంత రచ్చ కాలేదు. కేసులు.. విచారణ వరకూ వెళ్లలేదు. కానీ ఈ ఏడాది ఎన్నికలు జరగడానికి ముందు మాత్రం కల్వకుంట్ల కుటుంబం నుంచి తొలిసారి ఈడీ ఎదుట విచారణకు హాజరవ్వడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందా? లేదా? అన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. న్యాయస్థానాల్లో ఈ కేసులు వీగిపోవచ్చు. నిలబడవచ్చు. వాటిని ముందుగా అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు.
బీఆర్ఎస్ నేతలు మాత్రం...
ఎన్నికల ఏడాది లిక్కర్ స్కామ్ లో కవిత ఆరోపణలను ఎదుర్కొనడం మాత్రం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ కవితను ఈ స్కామ్ లో ఇరికించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత పార్టీలోకి రాకపోవడం వల్లనే ఆమెను వేధింపులకు గురి చేయడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి తెచ్చారంటున్నారు. తన ప్రమేయం లేదని చెబుతున్నా, ఎటువంటి ఆధారాలు లేకపోయినా విచారణ పేరుతో వేధిస్తున్నారని, కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న ధీమాను బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా...
కానీ బీజేపీ నేతలు మాత్రం నిప్పు లేనిదే పొగ వస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. దొరికిన వాళ్లంతా కవితకు సన్నిహితులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇక్కడ నీతి నిజాయితీగా మాట్లాడుతూ ఢిల్లీ వచ్చి లిక్కర్ స్కామ్ చేయడానికి కవితకు అక్కడ ఉన్న లింకులే కారణమని బీజేపీ నేతలు చెబుతున్నారు. కవితను అరెస్ట్ చేస్తారని వారు బహిరంగంగానే చెబుతున్నారు. కవితపై కేసు వల్ల బీజేపీకి ఎటువంటి నష్టం లేదని, బీఆర్ఎస్ కు సానుభూతి కూడా దొరకదని, అవినీతికి పాల్పడిన వాళ్లు జైలుకెళ్లాల్సిందేనని బీజేపీ చెబుతుంది. అసలు ప్రజలు ఈ ఘటనను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది భవిష్యత్ తేలనుంది. ఇలా మొత్తం మీద తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయంగా ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News