కాంగ్రెస్ తో దోస్తీ అసాధ్యం... బీజేపీతోనే చెలిమి తథ్యం
రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు బీజేపీతో వైరం పెట్టుకోరు. కాంగ్రెస్ తో కలవరు;

రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు బీజేపీతో వైరం పెట్టుకోరు. ఎందుకంటే వారి ప్రధాన శత్రువు బీజేపీ కాదు. కేవలం కాంగ్రెస్ మాత్రమే. ఇద్దరి విషయంలోనూ అంతే. అందుకే ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరిగే అఖిపక్షసమావేశానికి కూడా ఈ నేతలు హాజరయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ సదస్సును డీఎంకే నిర్వహిస్తున్నప్పటికీ పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు ఉండటంతో కాంగ్రెస్ తో చేతులు కలపలేని పరిస్థితి ఇద్దరిదీ. ఇద్దరి రాజకీయ ప్రయాణం అలాగే ప్రారంభమయింది. ఇక ముందు కూడా అలాగే సాగుతుంది. కాంగ్రెస్ వ్యతిరేకులుగానే ఉండిపోతారు తప్పించి దానికి మద్దతుదారులు అవ్వడం అనేది కాని పని. ఎందుకంటే ఇద్దరికీ కాంగ్రెస్ బద్ధ శత్రవు.
రాష్ట్రాన్నికాంగ్రెస్ ఇచ్చినా...
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కావచ్చు. కానీ ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్ నే భావిస్తారు. కాంగ్రెస్ వైరస్ లాంటిదని కేసీఆర్ కు తెలుసు. అది చచ్చినట్లే పదేళ్లు కనిపించినా ఒక్కసారి అధికారంలోకి వస్తుందని ముందుగానే అంచనా వేయలేకపోయినా.. ఇప్పుడే అధికారంలోకి కాంగ్రెస్ రాదని భావించారు. కానీ కాంగ్రెస్ తో దోస్తీ కడితే రాష్ట్రంలో తప్పుడు సంకేతాలు వెళతాయి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన విషయాలతో పాటు తర్వాత కాంగ్రెస్ తనకు ప్రధాన శత్రువుగా మారడంతో కాంగ్రెస్ ఉన్న కూటమికి ఆయన మద్దతివ్వరు. అలాగే బీజేపీకి కూడా నేరుగా మద్దతివ్వరు.ఎందుకంటే కొంత బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఇబ్బందులుంటాయని భావించి దానిపై దూకుడుగా ఉండకపోయినా కాంగ్రెస్ కంటే తక్కువ దూరాన్నే పాటిస్తారు.
జగన్ మాత్రం...
ఇక జగన్ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి జగన్ వచ్చినా ఆ పార్టీకి ఆగర్భశత్రువుగా మారిపోయారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు నంతా తాను తెచ్చుకోగలిగారు. తనను పదహారు నెలల పాటు జైలులో ఉంచడంతో పాటు రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ తో కూడిన కూటమితో జట్టు కట్టరు. అది రాష్ట్రంలో రాజకీయంగా ఆయనకు నష్టం తెచ్చిపెడుతుంది. దీంతో పాటు బీజేపీతో వైరాన్ని కూడా నేరుగాపెట్టుకోరు. విమర్శలు చేయరు. రహస్య మిత్రుడిగానే కొనసాగుతారు కానీ, నేరుగా ఆపార్టీతో పొత్తుకు సిద్ధపడరు. అలా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ తో జట్టు కట్టకపోవడానికి వారి వ్యక్తిగత, రాజకీయ కారణాలుండటంతోనే బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో బలోపేతం అవుతుందని చెప్పకతప్పదు. కానీ ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరగబోయే అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ హాజరైనా బీజేపీకి కొంత జర్క్ ఇవ్వడానికేనని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కలసి వస్తే అది దూరం పాటిస్తుందని చెబుతున్నారు.