పాపం... వరదాపురం సూరీ...!
మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. రాజకీయంగా ఆయన ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు
గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి రాజకీయాల్లో తనకు తానే ఫుల్్ స్టాప్ పెట్టుకున్నారనే అనిపిస్తుంది. టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయి తాత్కాలిక ప్రయోజనం కోసం బీజేపీలో చేరిన సూరికి రాజకీయ భవిష్యత్ కనుచూపు మేరలో కన్పించడం లేదు. ఆయన పార్టీ మారినా ఐదేళ్లు కమలం మాటున తలదాచుకునేందుకు ఉపయోగ పడి ఉండవచ్చేమో కాని, శాశ్వతంగా ధర్మవరానికి దూరమవుతారా? అన్న చర్చ మొదలయింది. పాపం.. సూరన్న అనే వాళ్లు కొందరైతే... పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వారికి అలాగేశాస్తి జరగాలి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో వరదాపురం సూరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
తాత్కాలిక ఉపశమనం కోసం...
2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ధర్మవరం ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పడు కూడా ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అధికార వైసీపీ నుంచి వేధింపులు, కేసుల నుంచి కాపాడుకోవడానికి ఆయన బీజేపీ పంచన చేరారు. ఎందుకు చేరారో ఆయనతో పాటు ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గంలో పెద్దగా బలం లేని పార్టీలో చేరడం ఆయన కేవలం తనను రక్షించుకోవడం కోసమే. అదే ఆయనను రాజకీయంగా బలి తీసుకున్నట్లయింది. ఆయనకు గత అనుభవాలు కూడా ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తున్నాయి. 2009 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కేతిరెడ్డి చేతిలోనే ఓటమి పాలయ్యారు.
టీడీపీలోకి వద్దామనుకున్నా...
ఎన్నికలకు ముందు టీడీపీలోకి వద్దామనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే అక్కడ పరిటాల శ్రీరామ్ పాతుకుపోయారు. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నాళ్లు వెయిట్ చేస్తారు. రెండేళ్లు ముందుగానే పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అక్కడ శ్రీరామ్ తిరుగుతూ కేతిరెడ్డిపై పోరాటం చేస్తూ క్యాడర్ వెంట నిలబడి ఉన్నారు. వరదాపురం సూరి అభ్యర్థిత్వాన్ని పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కష్ట సమయంలో పార్టీని వదిలేసి వెళ్లిపోయిన వారిని తిరిగి ఎలా చేర్చుకుంటారన్న ప్రశ్న ధర్మవరం టీడీపీ క్యాడర్ నుంచి వినిపిస్తుంది. పరిటాల శ్రీరామ్ కూడా వరదాపురం సూరి టీడీపీలో చేరిపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇద్దరి మధ్య వార్ ఎప్పటినుంచో జరుగుతుంది. తిరిగి వరదాపురం సూరిని పార్టీలోకి చేర్చుకుని ధర్మవరం టిక్కెట్ ఇచ్చినా పరిటాల వర్గం సహకరించనంతగా.
పోటీ చేస్తే మాత్రం..
తాజాగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ధర్మవరం టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అని ప్రకటించారు. లోకేష్ సాధారణ నేత కాదు. ఆయన చెబితే అది అధికారిక ప్రకటనగానే చూడాలి. ఆషామాషీగానో.. సరదాగానో.. తమాషాగానో చేసి ఉంటారని అనుకోవడానికి వీలులేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు పాదయాత్రలో ఆయన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ముఖ్యమైన నేతల విషయంలోనే లోకేష్ ప్రకటస్తున్నారు తప్పించి అన్ని చోట్లా ఇష్టమొచ్చినట్లు ప్రకటించరు. లోకేష్ నోటి నుంచి వచ్చింది అంటే అది సెలక్షనే.. ఎలక్షన్ లో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో వరదాపురం సూరి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తారా? లేదా బీజేపీ నుంచి బరిలో ఉంటారా? అన్నది చర్చనీయాంశమైంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అది వైసీపీకే అనుకూలిస్తుంది. అందుకే టీడీపీ ఆయనకు ఏ రకమైన రాజకీయ ఏర్పాట్లు చేస్తుందన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.