ఉండవల్లి వెంటపడుతూనే ఉంటారా?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను రాజకీయ పార్టీలు దగ్గరకు తీసుకోవు. అలాగని దూరం పెట్టవు.
ఉండవల్లి అరుణ్ కుమార్. రెండు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, న్యాయవాదిగా ఆయన అందరికీ తెలుసు. అదే సమయంలో మార్గదర్శిపై న్యాయపోరాటం చేస్తున్న వాడిగా కూడా ఆయనను కొందరు చూస్తారు. ఇక ఆయన రాజకీయంగా పదవీ విరమణ చేశానని ప్రకటించారు. తాను ఇకపై రాజకీయాల్లో ఉండబోనని కూడా చెప్పారు. అయితే తనకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పడంలో ముందుంటానని ఉండవల్లి చెబుతారు. అందులో భాగంగానే నెలలో రెండుసార్లు మీడియా సమావేశాలు పెట్టి ఏదో ఒక అంశంపై మాట్లాడుతుంటారు.
న్యాయవాది కావడంతో...
స్వతహాగా న్యాయవాది కావడంతో ఆయన అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట. సబ్జెక్టుపై పట్టున్న వ్యక్తి కావడంతో ఆయన మాటే ప్రతి మాటకు విలువ ఉంటుంది. ప్రజల్లోకి బలంగా వెళుతుందని రాజకీయ పార్టీల నేతలు కూడా నమ్ముతారు. అందుకే ఉండవల్లితో కేవలం ఆ జిల్లా రాజకీయ నేతలే కాదు రాష్ట్ర స్థాయి నేతలు కూడా దూరంగా ఉంటారు. ఆయన ఒకవేళ విమర్శలు చేసినా దానిని మళ్లీ పెద్దది చేసుకోవడం ఎందుకనో? లేకుంటే ఉండవల్లి తమ వెంట పడతారన్న భయమో తెలియదు. కాని ఆయన చేసే విమర్శలకు కౌంటర్లు కూడా అతి తక్కువగా పొలిటికల్ లీడర్స్ నుంచి వినిపిస్తాయి.
జగన్ పార్టీపై...
ఆయన ప్రధానంగా పోలవరం, రాష్ట్ర విభజన అంశాలపైనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. చట్ట విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దానిపై ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది విభజన ముగిసిపోయిన అథ్యాయంగా న్యాయస్థానంలో చెప్పడంతో ఆయనకు కోపమొచ్చింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. గతంలోనూ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా జగన్ ప్రభుత్వంపై ఉండవల్లి చేసిన సీరియస్ కామెంట్స్ వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఎవరి తప్పు ఉన్నా తాను నిక్కచ్చిగా చెబుతానని, అందులో ఎవరికీ మినహాయింపు ఉండదని ఉండవల్లి చెబుతుంటారు. యితే ఆయన మాటలను ప్రజలు నిజంగా పట్టించుకున్నారా? అంటే చెప్పలేని పరిస్థితి.
దూరం పెట్టవు.. దగ్గరకు తీసుకోవు....
ఎందుకంటే విడిపోయిన రాష్ట్రంపై న్యాయ పోరాటం చేయడాన్ని ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. న్యాయపరంగా వాదులాటల కోసమే తప్ప వాస్తవానికి దూరమైన అంశాన్ని ప్రజలు పరిగణనలోకి కూడా తీసుకోరు. ఆయన మేధావి కావచ్చు. లిటిగెంట్ అని ప్రత్యర్థులు అనొచ్చు. కానీ ఉండవల్లిని రాజకీయ పార్టీలు దగ్గరకు తీసుకోవు. అలాగని దూరం పెట్టవు. రిటైర్ అయిల ఆయన ఏ పనీ లేక ఏదో ఒకటి మాట్లాడుతున్నారని రాజకీయ పక్షాలు భావించి సైలెంట్ గానే ఉంటాయి. ఆయనను కెలుక్కునే సాహసాన్ని మాత్రం ఎవరూ చేయరు. అందుకే ఉండవల్లి వ్యాఖ్యలకు పెద్దగా కౌంటర్లుండవు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉండవల్లికి డిమాండ్ బాగానే ఉంటుంది. కానీ ఆయన ఎన్నికల సమయంలో ఎవరిని టార్గెట్ చేస్తారన్న టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఉండవల్లి విషయంలో కొంత భయపడుతున్నట్లే కనిపిస్తుంది.