ఇక్కడ టీడీపీకి అభ్యర్థికి దొరికినట్లేనా?

టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా గన్నవరం ఒకటి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తొలి నుంచి పట్టు సాధిస్తుంది.

Update: 2022-03-05 03:16 GMT

తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా గన్నవరం ఒకటి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తొలి నుంచి పట్టు సాధిస్తుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో అక్కడ టీడీపీయే గెలిచింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత వల్లభనేని వంశీ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నేతను ఎంపిక చేయాల్సి ఉంది.

సరైన అభ్యర్థి కోసం....
వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ గెలవాలంటే సరైన అభ్యర్థి అవసరం. ఇందుకోసం గత కొన్ని రోజులుగా చంద్రబాబు అభ్యర్థి అన్వేషణలో ఉన్నారు. టీడీపీకి గన్నవరంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. పూర్తి స్థాయిలో క్యాడర్ ఉంది. వల్లభనేని వంశీ పార్టీకి దూరమయిన తర్వాత అక్కడ తాత్కాలిక ఇన్ ఛార్జిగా బచ్చుల అర్జునుడును చంద్రబాబు నియమించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బచ్చుల అర్జునుడికి వల్లభనేని వంశీని తట్టుకునే స్థాయి లేదన్నది అక్కడి క్యాడర్ అభిప్రాయం.
గద్దె పేరు....
అయితే గన్నవరం నుంచి గతంలో పోటీ చేసి గెలిచారు. 1994లో జరిగిన ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. సామాజికపరంగా, ఆర్థికంగా గద్దె రామ్మోహన్ ధీటైన అభ్యర్థి అని అక్కడి క్యాడర్ కూడా నమ్ముతోంది. అయితే గద్దె రామ్మోహన్ ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మరోసారి గన్నవరం వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
దాసరి కుటుంబం....
గద్దె రామ్మోహన్ కాకుండా మరో కమ్మ సామాజికవర్గం నేత పేర్లను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1999లో గన్నవరం నుంచి టీడీపీ తరుపున గెలిచిన దాసరి బాలవర్థనరావు పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది. అయితే వారు వైసీపీలో 2019 ఎన్నికలకు ముందు చేరారు. అయితే ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్ గా లేరు. వారిని తిరిగి పార్టీలోకి తీసుకు రావాలన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాసరి ఫ్యామిలీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. గన్నవరంలో ఐదు సార్లు గెలిచిన టీడీపీ మరోసారి గెలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరి వల్లభనేని వంశీకి ప్రత్యామ్నాయ నేత దొరుకుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News