నెల్లూరుకు చేరిన గౌతమ్ రెడ్డి భౌతిక కాయం.. రేపు అంత్యక్రియలు
తమ ప్రియతమ, అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు అభిమానులు గౌతమ్ రెడ్డి నివాసానికి భారీగా తరలి వస్తున్నారు. పాతికేళ్లుగా..
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం కొద్దిసేపటి క్రితమే నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరింది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గౌతమ్ రెడ్డి నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈరోజు కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. నేటి రాత్రికి గౌతమ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి నెల్లూరుకు చేరుకోనున్నారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
తమ ప్రియతమ, అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు అభిమానులు గౌతమ్ రెడ్డి నివాసానికి భారీగా తరలి వస్తున్నారు. పాతికేళ్లుగా తమకు పని ఇచ్చి, ఏ కష్టమొచ్చినా ఆదుకున్న గొప్ప నాయకుడు.. ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేక ఆయన వ్యక్తిగత సిబ్బంది కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించే రిపోర్టర్లు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు.
రేపు అంత్యక్రియలు
రేపు ఉదయం 11 గంటలకు మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్ లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.