గుడ్ న్యూస్ : ఒమిక్రాన్ పై ఇక ఆందోళన అక్కర్లేదు !

టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ గుడ్ న్యూస్ చెప్పారు. కేసుల తీవ్రత పెరుగుతున్నా.. వైరస్ ప్రభావం

Update: 2022-01-03 05:21 GMT

కరోనా తో పాటు ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు మళ్లీ లాక్ డౌన్లను అమలుచేస్తున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్కడ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే తగు చర్యలు చేపట్టాయి. తమిళనాడులో జనవరి 10వ తేదీ వరకూ స్కూళ్లను మూసివేయగా.. కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పనిచేయనున్నాయి. క్రమంగా మళ్లీ సినీ ఇండస్ట్రీకి గడ్డుకాలం దాపరిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడగా.. మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. దీంతో పాన్ ఇండియా సినిమాల విడుదళ్లు మళ్లీ వాయిదా పడ్డాయి.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ గుడ్ న్యూస్ చెప్పారు. కేసుల తీవ్రత పెరుగుతున్నా.. వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని ఆయన చేసిన అధ్యయనంలో తేలిందని యూనస్ పేర్కొంటున్నారు. యూనస్ చెప్పిన వివరాల ప్రకారం.. డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. సౌతాఫ్రికాలోని ఆస్పత్రుల్లో ఉన్న ఒమిక్రాన్ బాధితులపై ఆయన చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయని చెప్తున్నారు. అధ్యయనంలో భాగంగా 91 శాతం డెల్టా బాధితులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో 31 శాతం మాత్రమే తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు ఉన్నాయని డేటాలో గుర్తించినట్టు తెలిపారు. డెల్టా రోగులలో 7 రోజులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో ఆసుపత్రిలో చేరే వ్యవధి 3 రోజులకు తగ్గినట్టు అధ్యయన డేటాలో ఉందన్నారు. డెల్టా వేరియంట్ బాధితుల్లో 69 శాతం మంది ఆస్పత్రిలో చేరగా.. ఒమిక్రాన్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరేవారు 41 శాతం ఉన్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా డెల్టా సోకిన బాధితుల్లో 12 శాతం మంది వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటే.. ఒమిక్రాన్ బాధితుల్లో 1.6 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ పై చికిత్స అవసరమవుతోందని పేర్కొన్నారు. డెల్టా బాధితుల్లో మరణాల రేటు 29 శాతం ఉండగా.. ఒమిక్రాన్ బాధితుల్లో మరణాల రేటు 3 శాతంగా ఉందన్నారు. కాగా.. ఒమిక్రాన్ బారిన పడుతున్నవారిలో అధికంగా చిన్నవయసు వారే ఉంటున్నారని, వ్యాక్సినేషన్ ద్వారా వారిలో ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు యూనస్. మొత్తం మీద డెల్టా వేరియంట్ కన్నా.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.



Tags:    

Similar News