రాజధాని రగడ రావణకాష్టమేనా?

రాజధాని విషయంలో మాత్రం జగన్ నిర్ణయం సరైనదే. భవిష్యత్ లో రాష్ట్రం మరిన్ని ముక్కలు కాకుండా ఉండాలంటే ఆ నిర్ణయమే కరెక్ట్.

Update: 2021-11-23 04:38 GMT

ఎవరు ఏమైనా అనుకోవచ్చు. రాజధాని విషయంలో మాత్రం జగన్ నిర్ణయం సరైనదే. భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ మరిన్ని ముక్కలు కాకుండా ఉండాలంటే జగన్ నిర్ణయమే కరెక్ట్. ఇప్పటికిప్పుడు కాదు. వందేళ్ల తర్వాత అయినా అమరావతి రాజధానిగా ఒక్కటి ఉంటే మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాక మానదు. అందుకే జగన్ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు, మేధావులు, పార్టీలు కూడా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సమర్థించాల్సిందే.

మరో హైదరాబాద్...
23 జిల్లాల డబ్బు పోగేసి హైదరాబాద్ నిర్మాణం చేసినా, ఏమి చేయలేదు అనిపించుకుని, తన్ని తరిమి వేయబడి, ఇక్కడి తీర ప్రాంతం తేమ, జిడ్డు, జిగటలను అసహ్యించుకుని, గతిలేక మళ్ళీ వెనక్కివచ్చి అదే పొరపాట్లు ఎందుకు చేయాలి. మళ్ళీ 13జిల్లాల ప్రజల రెక్కల కష్టాన్ని, పన్నుల ఆదాయాన్ని అమరావతిలో కుప్పగా పోగేయాలా? ఈ ప్రశ్నలకు సమాధానం చంద్రబాబు చెబుతారా? అదే జరిగితే మరోసారి ముక్కలు చేయడానికి సిద్ధమవుతారా?
ఎందుకు మద్దతివ్వాలి?
రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండటానికి అందరూ మద్దతివ్వాలా? రేపు జగన్, బాబు పదవి నుంచి దిగి పోయాక ఏపీలో మరో కేసీఆర్ వచ్చి కొత్త రాజకీయ వాదం పుడితే, ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్ళు కోస్తా వాళ్ళని అసహ్యించుకుంటారు. అలా ఏమి జరగదు అనే గ్యారంటీ ఏమైనా ఇస్తారా? లేదు ఇవ్వలేరు. ఎందుకంటే భవిష్యత్ ను గురించి రాజకీయ నేతలు చెప్పే మాటలను ఎవరూ నమ్మరు. నమ్మబోరు. వారిచ్చే హామీలనే అమలు చేయరు.
రేపు జగన్ కూడా....
ఒక వేళ 2024లో ఫలితాలు తారుమారైతే జగన్ కూడా ఖాళీగా ఉండడు కదా? మూడు రాజధానుల కోసం మూడు ప్రాంతాల నుంచి పోరాటం చేయడా? ఈ రాజధాని అంశం ఇంతటితో ముగుస్తుందని భావిస్తున్నారా? రగులుతూనే ఉంటుంది. చంద్రబాబు, జగన్ ఎవరు అధికారంలో ఉన్నా సరే రాజధాని రగడ, రచ్చను ఆగే అవకాశం ఎంతమాత్రం లేదు. అమరావతికి మద్దతుగా ఉద్యమించే వారు, ఉద్యమకారులకు మద్దతిచ్చే మాధ్యమాలు, వాటి ప్రయోజనాలు... ఎవరి లెక్కలు వారివి.


Tags:    

Similar News