తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుల జాబితాను ఐఐఎఫ్ఎఫ్ వెల్త్ హురున్ ఇండియా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుల జాబితాను ఐఐఎఫ్ఎఫ్ వెల్త్ హురున్ ఇండియా ప్రకటించింది. సంపన్నులు జాబితా 2022 ను వెల్లడించింది. వీరంతా వెయ్యి కోట్ల ఆస్తికి పైగా ఉన్న వారు. వెయ్యి కోట్లకు మించి ఆస్తి ఉన్న 78 మంది తెలుగు రాష్ట్రాల్లో సంపన్నుల పేర్లను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే వీరి ఆస్తుల విలువ ఈ ఏడాడి మూడు శాతం పెరిగిందని కూడా తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
దివీస్ అగ్రస్థానం...
దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళీ దివితో పాటు ఆయన కుటుంబం 56,200 కోట్ల రూపాయలతో అత్యంత ధనిక కుటుంబంగా ప్రధమ స్థానంలో నిలిచింది. హెటిరో ల్యాబ్స్ కు చెందిన పార్థసారధి రెడ్డి ఫ్యామిలీ 39,200 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉన్నారు. మరో పారిశ్రామికవేత్త మహిమ దాట్ల 8,700 కోట్ల రూపాయలతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా ఆమె గుర్తింపు పొందారని ఈ జాబితా వెల్లడించింది.
హైదరాబాదీలే...
అయితే ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారే. మొత్తం 78 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకోగా అందులో 64 మంది హైదరాబాద్ కు చెందిన వారు. వీరిలో ఫార్మా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, భవన నిర్మాణ రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు. వీరితో పాటు విశాఖపట్నం నుంచి ఐదుగురు, రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. ఈసారి కొత్తగా తెలుగు రాష్ట్రాల నుంచి మరో 11 మంది స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 30 నాటి ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఐఐఎఫ్ఎఫ్ వెల్త్ హురున్ ఇండియా ప్రకటించింది.