రాజకీయంగా ఇక విశ్రాంతి తప్పదట
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి కనపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి కనపడుతుంది. ప్రధానంగా ప్రజలకు అందుబాటులో లేని, అవసరాలు తీర్చని ఎమ్మెల్యేలపై ప్రజలే కాదు సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో తిరుగుబాటు మామూలే. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే ఇబ్బందిగా మారారు. అదే ఉదయగిరి నియోజకవర్గం.
టీడీపీ లోనూ....
ఉదయగిరి నియోజకవర్గంలో 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా బొల్లినేని రామారావు గెలిచారు. ఆయన పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. ఎన్నికల సమయంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ అధిష్టానం వద్ద తుదికంటా పోరాడారు. అయినా అధినాయకత్వం చివరి నిమిషంలో ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. అసంతృప్తి వర్గం సైడ్ అయిపోయింది. ఫలితంగా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
ఇప్పుడున్న మేకపాటికి....
ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎదురయింది. కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ నాయకులంతా ఆయనకు వ్యతిరేకమై సమావేశాలు పెట్టుకున్నారు. తమ వద్ద కూడా లంచాలు వసూలు చేస్తున్నారంటూ మేకపాటిపై ఆరోపణలను బహిరంగంగానే చేశారు. పదవులు, పోస్టులను అమ్మేసుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీలో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.
కొత్త నేత కోసం....
దీంతో ఈసారి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టిక్కెట్ దక్కడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈసారి ఆయనకు వైసీపీ నుంచి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని వైసీపీ అధినాయకత్వం సూచించే ఛాన్స్ ఉంది. దీంతో ఉదయగిరి నుంచి వైసీపీ కొత్త నేత ఎవరా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ ఈసారి జగన్ సామాజికవర్గాల సమీకరణాల మేరకు టిక్కెట్ ను కేటాయిస్తారంటున్నారు.