ఇప్పుడు ట్రెండింగ్ లో వీరిద్దరేనట
ఆంధ్రప్రదేశ్ లో కాపులు బలమైన సామాజికవర్గం. కాపు ఓటు బ్యాంకును ఓన్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి
ఆంధ్రప్రదేశ్ లో కాపులు బలమైన సామాజికవర్గం. కాపు ఓటు బ్యాంకును ఓన్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. మంత్రి వర్గంలో స్థానం దగ్గర నుంచి పార్టీ లో పదవుల వరకూ వారికి అత్యధిక ప్రాధాన్యత నిస్తాయి. కాపులు రాజ్యాధికారాన్ని సాధించాలన్న నినాదం నినాదంగానే మిగిలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది సాధ్యం కాకపోయినా విభజిత ఆంధ్రప్రదేశ్ లో అది సాధ్యమవుతుందని కాపు సామాజికవర్గం నేతలు నమ్ముతున్నారు.
కోవర్టులుగా మారి....
కానీ కాపుల్లో కొందరు కీలక నేతలు వైసీపీ, టీడీపీ కోవర్టులుగా మారిపోయారని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభంలపై సెటైర్లు వినపడుతున్నాయి. ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ కోవర్టులుగా మారిపోయారన్న పోస్టింగ్ లు సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం వైసీపీికి కోవర్టుగా మారి కాపులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
వైసీపీతో జతకట్టి....
ఆయన కాపు రిజర్వేషన్ పోరాట సమితి నుంచి పక్కకు తప్పుకుని చంద్రబాబుకు లేఖలు రాయడం ప్రారంభించారంటున్నారు. టీడీపీ మరోసారి అధికారంలోకి రాకుండా ఉండటమే ముద్రగడ లక్ష్యంగా కన్పిస్తుందని కాపు నేతలే ఒప్పుకుంటున్నారు. ఇక వంగవీటి రాధా కూడా టీడీపీకి కోవర్టుగా మారిపోయారంటున్నారు. తన హత్యకు రెక్కీ జరిగిందన్న డ్రామాతో వంగవీటి రాధా కాపు ఓటు బ్యాంకును టీడీపీ పరం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.
టీడీపీకి అనుకూలంగా....
సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ వినపడుతున్నాయి. "కాపులువెప్పుడూ బానిస బతుకులే అని మరోసారి నిరూపించేందుకు ఇద్దరు నాయకులు సిద్ధమయ్యారు. ఒకరు ముద్రగడ పద్మనాభం. ఏదో కృష్ణారామా అంటూ కాలం గడపాల్సిన వయసులో, వైసీపీ కోవర్ట్ గా మారి కాపులను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.మరొకరు వంగవీటి రాధా. తెలుగుదేశానికి కాపు ఓట్లు వేయించడానికి తన మీద హత్యాయత్నం జరగబోతోందన్న డ్రామా మొదలు పెట్టారు. ఇద్దరూ YCP, TDP కోవర్టులన్న విషయం తెలుసుకునేంత తెలివి కాపుల్లో లేదని వీరి అభిప్రాయం. అందుకే వీరి ఆటలు సాగుతున్నాయ్. పవన్ కళ్యాన్ ఆటలో అరటిపండులా మిగిలిపోయారు." అంటూ పోస్టింగ్ లు కనపడుతున్నాయి.