నాడు బాబయినా.... నేడు జగన్ అయినా?

ఏడేళ్ల నుంచి ఏపీ లో అఖిలపక్షం మాట విన్పించడం లేదు. అధికారంలో చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా సమావేశానికి ముందుకు రావడం లేదు

Update: 2021-12-18 07:44 GMT

అఖిలపక్షం.. దాదాపు ఏడేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అఖిలపక్షం మాట విన్పించడం లేదు. చంద్రబాబు 2019 కు ముందు మాత్రమే అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. ఆ అఖిలపక్షానికి ప్రధాన పార్టీలు ఎవరూ హాజరు కాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మరోసారి అఖిలపక్షం ప్రస్తావన తెచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేవడానికి వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అఖిలపక్షం....
జగన్ ప్రభుత్వం మాత్రం అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిన అవసరం తమకు లేదంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేస్తామని చెబుతుంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు మాత్రం అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ వెళితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం అఖిలపక్షం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేరు.
బాబు ఉన్నప్పుడు....
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని నిర్ణయంపై కూడా అఖిలపక్షం ఏర్పాటు చేయలేదు. ఆయన సొంత నిర్ణయంతోనే రాజధానిని ప్రకటించారు. ఇక ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు కూడా అఖిలపక్షం ఏర్పాటు చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొంత తేడా రావడంతో అప్పుడు హడావిడిగా అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ సమావేశాలకు జనసేన, వైసీపీ వంటి ముఖ్యపార్టీలే డుమ్మా కొట్టాయి.
ఢిల్లీకి తీసుకెళ్లేందుకు....
అఖిలపక్షం ఏర్పాటు వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఎవరు అధికారంలో ఉన్నా ఆల్ పార్టీ మీటింగ్ కు ముందుకు రారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తో ప్రధాన పార్టీలన్నీ లాలూచీ నడుపుతున్నాయి. తమ ప్రత్యర్థి పార్టీలను కలుపుకుని ఢిల్లీ వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. అప్పుడు చంద్రబాబు కాని. ఇప్పుడు జగన్ కాని. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళలో అఖిలపక్ష సమావేశాలను పెట్టి అక్కడి ప్రభుత్వాధినేతలు సమస్యను అందరిదిగా చూపుతున్నారు. కానీ ఏపీలో గత ఏడేళ్లుగా అది కొరవడిందనే చెప్పాలి.


Tags:    

Similar News