తాడికొండలో డొక్కా vs శ్రీదేవి
తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు ముదిరాయి. డొక్కా మాణిక్యవరప్రసాద్ ను సమన్వయకర్తగా నియమించడాన్ని తప్పుపడుతున్నారు
తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు ముదిరిపోయాయి. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ను సమన్వయకర్తగా నియమించడాన్ని తప్పుపడుతున్నారు. ఈరోజు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరులు గుంటూరులో సమావేశం అవుతున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ను సమన్వయకర్తగా తొలగించకపోతే తాము పార్టీకి రాజీనామా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు డొక్కా అనుచరులు కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఫిరంగి పురంలో వారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
సమన్వయకర్తగా...
తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై అసంతృప్తి పెరిగిందని గ్రహించిన పార్టీ హైకమాండ్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించింది. వచ్చే ఎన్నికల్లో డొక్కాకు టిక్కెట్ ఇస్తారని అప్పుడే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభమయింది. ఉండవల్లి శ్రీదేవికి టిక్కెట్ రాదని వారు పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఉండవల్లి శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకమాండ్ కు హెచ్చరిక...
ఉండవల్లి శ్రీదేవి పై పార్టీ హైకమాండ్ కూడా అసంతృప్తిగా ఉంది. ఎక్కువ సమయం నియోజకవర్గంలో ఉండకపోవడం, ప్రజ.లకు అందుబాటులో లేకపోవడంతో ఉండవల్లి శ్రీదేవిపై అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతుందని గ్రహించిన పార్టీ హైకమాండ్ డొక్కాను సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి అనుచరులు ఈరోజు సమావేశమై భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇటు డొక్కా అనుచరులు కూడా సమావేశం అవుతున్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు డొక్కాను సమన్వయకర్తగా అందరూ అంగీకరించాల్సిందేనని వారు కోరుతున్నారు.