జగ్గారెడ్డి నిర్ణయం అదేనా?
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తన రాజీనామా ఆలోచనను విరమించుకున్నట్లే కనపడుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తన రాజీనామా ఆలోచనను విరమించుకున్నట్లే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన జగ్గారెడ్డి సీనియర్ల బుజ్జగింపులతో పదిహేను రోజుల పాటు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా జగ్గారెడ్డి రాజీనామా చేయరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగ్గారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారని పార్టీ సీనియర్ నేత ఒకరు "తెలుగు పోస్ట్" కు చెప్పారు.
సోషల్ మీడియాలో....
పది రోజుల క్రితం రేవంత్ రెడ్డి అనుచరుల సోషల్ మీడియా పోస్టింగ్ లను వ్యతిరేకిస్తూ జగ్గారెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మీడియా సమావేశం పెట్టి తాను ఎందుకు? ఎప్పుడు రాజీనామా చేయాలనుకుంటుందీ చెప్పారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు బుజ్జగించడంతో పదిహేను రోజులు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అపాయింట్ మెంట్ కావాలని....
తనకు సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు. కానీ వారి అపాయింట్ మెంట్ దొరికే అవకాశం లేదని తేలింది. అలాగే తన ముఖ్య అనుచరులతో జగ్గారెడ్డి కొద్ది రోజుల క్రితం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనుచరులు కూడా కాంగ్రెస్ లోనే కొనసాగాలని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీలతో త్వరలో సంగారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు.
మళ్లీ యాక్టివ్ గానే...
మల్లు భట్టి విక్రమార్క నిన్న నిర్వహించిన సీఎల్పీ సమావేశంలోనూ జగ్గారెడ్డి పాల్గొన్నారు. అయితే మరోసారి రేవంత్ రెడ్డి తన జిల్లాలో తనకు తెలియకుండా పర్యటించారంటూ అలిగి వెళ్లిపోయారు. ఇది మామూలేనని, జగ్గారెడ్డి ఎక్కడికీ పోరని, పార్టీలోనే ఉంటారని సీనియర్ నేతలు చెబుతున్నారు. జగ్గారెడ్డికి అధిష్టానం నుంచి కూడా కొంత హెచ్చరికలు లాంటివి వచ్చినట్లు తెలిసింది. ప్రతి అంశాన్ని మీడియాకు ఎక్కి రచ్చ చేయడం సరికాదని తెలిపింది. పార్టీలో మళ్లీ జగ్గారెడ్డి యాక్టివ్ గానే కన్పిస్తున్నారు. ఇప్పుడు రాజీనామా వ్యవహారాన్ని మీడియా మిత్రుల ముందు కూడా ఎత్తకపోవడంతో ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చినట్లే కన్పిస్తుంది.