సింగిల్ హ్యాండ్ తో సాధ్యమయ్యేనా?
ఏపీ రాజకీయాల్లో ఒక స్పష్టత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ ఒంటరిపోరుతో విపక్షాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్పష్టత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ ఒంటరిపోరుతో విపక్షాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే గత ఎన్నికల మాదిరి కాదు. ఈసారి అన్ని జెండాలు ఏకమై ఒకే అజెండాతో ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. జగన్ ను ఓడించడమే లక్ష్యమని చెబుతున్నాయి. ఈసారి ఎన్నికలు జగన్ కు అంత సులువు కాదు. పోటీ తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన కాంబినేషన్ జగన్ మరోసారి విజయానికి గండికొట్టే అవకాశాలు లేకపోలేదు.
ఒంటరిగానే...
అయితే ఈసారి కూడా జగన్ ఒంటరిగానే బరిలోకి దిగనున్నారు. జగన్ ఈసారి గతం కంటే మించిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో ఆర్థికంగా పెద్దగా బలంగా లేరు. సంస్థాగతంగా కూడా పార్టీ బలోపేతం కాలేదు. కేవలం తన పాదయాత్రతో 151 స్థానాలను జగన్ సాధించిపెట్టారు. అయితే ఈసారి సంస్థాగతంగా బలంగా ఉన్నారు. ఆర్థికంగా మరింత బలోపేతమయ్యారు. కానీ కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
గత ఎన్నికలకు....
జగన్ గత ఎన్నికల నాటికి ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకు ఆయన చేసిన విజ్ఞప్తి వర్క్ అవుట్ అయింది. అయితే ఈసారి అలా కాదు. ఆయన పాలనను జనం చూశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆయనకు పేరు పెట్టడానికి వీలులేదు. అదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే తాను హామీలను అమలు చేశారు. కానీ ఏపీలో అభివృద్ధి లేకపోవడమే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఇబ్బందిగా మారనుంది.
పొరుగు రాష్ట్రంలో....
కానీ కూటముల వల్ల ప్రభుత్వానికి పెద్దగా నష్టం జరగదని జగన్ భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పాటయిన మహాకూటమికి ఎలాంటి ఫలితాలు ఎదురయ్యాయో చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే మరోసారి కేసీఆర్ కు జనం ఓటేశారు. మహాకూటమిని పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా ఏపీలో అదే జరుగుతుందని వైసీపీ అధినేత లెక్కలు వేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు విశ్వసించరని, వారి నిలకడలేని స్వభావం తనకు మరోసారి కలసి వస్తుందని జగన్ అంచనాలుగా ఉన్నాయి. ఏమో చెప్పలేం. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.