పాపం... మేకపాటి.. అందరి నోటా ఆ పేరే

విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లోనూ వైసీపీకి చెందిన మంత్రులతో పాటు పార్టీ నేతలు కూడా మేకపాటిని తలచుకోని వారు లేరంటారు

Update: 2023-03-05 03:58 GMT

మేకపాటి గౌతమ్ రెడ్డిని ప్రత్యర్థులు కూడా విమర్శించడానికి వెనుకాడతారు. విపక్ష పార్టీలు సయితం ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతాయి. బతికున్నప్పుడే ఆయనపై విమర్శలు ఎవరు చేయలేదు. మేకపాటి సౌమ్యుడు. అసలు రాజకీయాల్లో ఎలా మనగలుగుతాడా? అని అందరూ అనుకున్న వారే. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని వచ్చిన వెంటనే ఆయన అదృష్టం కొద్దీ తక్కువ సమయంలోనే మంత్రి పదవిని పొందారు. అయితే అదే సమయంలో అతి చిన్న వయసులో గుండెపోటు హఠాన్మరణం పాలయ్యారు. కానీ ఆయనను ఇప్పటికీ కొందరు మరచిపోలేక పోతున్నారు.


సంవత్సరం దాటినా...

మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించి సంవత్సరం దాటింది. అయినా ఆయనను స్మరించుకోవడానికి, ఆయన పేరును తలుచుకోవడానికి కారణం లేకపోలేదు. అదే విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్. నిజానికి మేకపాటి గౌతమ్ రెడ్డి జీవించి ఉంటే ఆయనను మంత్రి వర్గం నుంచి జగన్ తొలిగించి ఉండేవారు కాదంటారు. ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులను కంటిన్యూ చేయాలన్నది జగన్ భావన అని చెబుతారు. మేకపాటి జీవించి ఉండి ఉంటే ఖచ్చితంగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఖచ్చితంగా నిలిచేవారు.
గ్లోబల్ సమ్మిట్ లో...
రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లోనూ వైసీపీకి చెందిన మంత్రులతో పాటు పార్టీ నేతలు కూడా మేకపాటిని తలచుకోని వారు లేరంటారు. బహిరంగంగా ఆయన పేరు చెప్పకపోయినా వ్యక్తిగత సంభాషణల్లో మేకపాటిని గుర్తు చేసుకున్నారని చెబుతున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా మూడేళ్లపాటు మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన కృషిని ఎవరూ మరవలేరు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లు వరసగా కోవిడ్ రావడంతో ఎలాంటి సదస్సులను నిర్వహించలేదు. అయితే దావోస్ సదస్సుకు ఆయన వెళ్లారు. పలు పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

జగన్‌కు స్నేహితుడిగా...
మేకపాటి గౌతమ్ రెడ్డి నిజంగానే అందరి ప్రశంసలు అందుకున్నారు. మేకపాటి గౌతమ్ జగన్‌కు అత్యంత ఆప్తుడు. ఒరిజినల్‌గా బిజినెస్ మ్యాన్. అందుకే ఆయనకు తొలి మంత్రివర్గంలోనే పరిశ్రమల శాఖను జగన్ కు అప్పగించి బిందాస్ గా ఉన్నారు. తాను పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా మేకపాటి అంతా తానే అయి చూసుకుంటాడన్న భరోసా జగన్ కు ఉండేది. అలా అని ఇప్పుడున్న మంత్రి గుడివాడ అమరనాధ్‌ను విమర్శించడం కాదు కాని, మేకపాటి గౌతమ్ రెడ్డికి పరిశ్రమలు రాష్ట్రానికి ఎలా తేవాలన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉండేది. అలాంటి మేకపాటి లేని లోటు జగన్ కు వ్యక్తిగతంగా నష్టమే. కానీ మేకపాటిని మాత్రం పార్టీ నేతలు విశాఖలోని గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా గుర్తు చేసుకుని మరీ కొందరు కంటతడి పెట్టడం కనిపించింది. అయితే బహిరంగంగానైనా సమ్మిట్ లో మేకపాటి గురించి ప్రస్తావించే బాగుండి ఉండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News