యనమల బ్రదర్స్ ... విడిపోతారా?
సీనియర్ నేత యనమల రామకృష్ణుడి ఇంట్లో సీటు మధ్య రగడ ప్రారంభమయింది.
ఎవరైనా అంతే.. రాజకీయాల్లో బ్రదర్ లేదు. ఓన్ బ్లడ్ లేదు. అంతా సొంతమే. ఎవరికి వారు తామే పెత్తనం చేయాలనుకుంటారు. పోటీ చేయాలని భావిస్తారు. గెలిచినా, ఓడినా అది తమ అడ్డాగానే ఉండాలని ఆశిస్తారు. తుని నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడి ఇంట్లో సీటు మధ్య రగడ ప్రారంభమయింది. తుని నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోట ీచేస్తారన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అంతే కాదు సోదరుల మధ్య బేధాభిప్రాయాలు బయటపడుతున్నాయి.
యనమల ఇంట్లో విభేదాలు...
ఎవరికి వారే తుని సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు సార్లు వరసగా ఓటమి పాలయితే సీటు ఇచ్చేది లేదని మహానాడులో లోకేష్ ప్రకటించారు. దీంతో యనమల సోదరుడు యనమల కృష్ణుడికి సీటు రాదని మే నెలలో జరిగిన మహానాడులోనే తేలిపోయింది. యనమల కృష్ణుడు 2009, 2014, 2019 ఎన్నికల్లో వరసగా ఓటమి పాలయ్యారు. ఆయన స్థానంలో యనమల రామకృష్ణుడి కుమార్తెకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అధినాయకత్వంతో యనమల మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. తన సోదరుడిని వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఆయన భావిస్తున్నారు.
కుమార్తె కోసం...
అయితే యనమల కృష్ణుడికి ఇది రుచించడం లేదు. తన సోదరుడు కుమార్తె కోసం తన రాజకీయ భవిష్యత్ ను దెబ్బతీస్తున్నాడని భావిస్తున్నారు. మూడు సార్లు ఓటమి పాలయ్యానన్న కారణంతో తనను పక్కన పెట్టి తన కుమార్తెకు సీటు ఇప్పించుకోవాలని టీడీపీ హైకమాండ్ వద్ద యనమల రామకృష్ణుడు వత్తిడి తెస్తున్నారని కృష్ణుడు భావిస్తున్నారు. దీంతో తనకు సంబంధించిన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేయాలని కృష్ణుడు గట్టిగా భావిస్తున్నారు. అందుకోసం అవసరమైతే అన్నను ఎదిరించడానికైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ సంభాషణ...
ఇందులో భాగంగానే తొండంగి పార్టీ నేత ఒకరికి యనమల కృష్ణుడు చేసిన ఫోన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి గ్రామం నుంచి నలభై మంది రావాలని యనమల కృష్ణుడు కోరారు. తాను లేకుంటే తునిలో టీడీపీయే లేదని తన అన్నకు చెప్పాలంటూ ఆయన ఫోన్ చేసిన తీరు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. తునిలో తాను ఓటమి పాలయినా నాలుగేళ్ల నుంచి పార్టీని రక్షించుకుంటూ వస్తున్నానని, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నానని, అది విస్మరించి వేరే వారికి సీటు ఇస్తే అంగీకరించేది లేదని యనమల కృష్ణుడు స్పష్టం చేయడంతో ఇప్పుడు తుని హైకమాండ్ కు తలనొప్పిగా మారనుంది.