నాదెండ్ల విలన్‌గా మారారా?

జనసేన క్యాడర్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది

Update: 2023-03-13 07:11 GMT

అవును.. జనసేన క్యాడర్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలే తరచూ పోస్టులు చేస్తున్నారు. నాదెండ్లకు అంతా అప్పగించి సినిమాలు చేసుకుంటే ఎలా అన్నా అంటూ పవన్ ను ప్రాధేయపడుతూ పోస్టులు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత అయినా పార్టీ వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహార్ మాత్రమే చూసుకుటున్నారు. జిల్లాల పర్యటనల దగ్గర నుంచి ముఖ్యమైన నేతలతో భేటీల వరకూ ఆయనే చూసుకుంటున్నారు. ఇది జనసేన పార్టీలోని ఎక్కువ మందికి రుచించడం లేదు.


సోషల్ మీడియాలో...

పైగా నాదెండ్ల మనోహర్ దగ్గరుండి తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా ఆ పార్టీ నుంచే వినపడుతున్నాయి. నిజానికి నాదెండ్ల మనోహర్ మృదుస్వభావి. రాజకీయాలను రఫ్ గా చేయలేరన్న పేరుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్దగా వివాదంలో కనపడే వారు కాదు. తన తండ్రి నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారే కాని, ఆయన ముద్ర, నీడ తన మీద పడకుండా తొలి నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే మనోహర్ కు సౌమ్యుడిగా పేరుంది. నిజానికి ఆయన జనసేనలోకి వెళతారని ఎవరూ భావించలేదు.
నెంబర్ టూగా...
రాష్ట్ర విభజన జరిగిన వెంటనే నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని అందరూ అనుకున్నారు. ఆయన అందరి అంచనాలకు భిన్నంగా ఆయన జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. పార్టీలో నెంబరు 2 నాదెండ్ల మాత్రమేనని చెప్పాలి. నాదెండ్ల చెబితేనే పవన్ వింటారన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతుంది. అయితే అనేక మంది జనసేన నుంచి వెళ్లిపోవడానికి కూడా నాదెండ్ల మనోహర్ కారణమనే వారు లేకపోలేదు. తొలినాళ్లలో ఉన్న వాళ్లంతా పార్టీని వీడారు. అయినా నాదెండ్ల మాత్రం పవన్ వెంటే ఉన్నారు. పవన్ కూడా అంతా నమ్మి సర్వం నాదెండ్ల చేతిలో పెట్టారంటారు.

కొందరి వైపే...
కన్నా లక్ష్మీనారాయణ, హరిరామ జోగయ్యలతో భేటీ బాధ్యతను కూడా నాదెండ్ల మనోహర్ కే అప్పగించారు. దీంతో ఆయన జిల్లాల పర్యటనలో కొందరిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏ పార్టీలోనైనా పదవుల కోసం, టిక్కెట్లు కోసం పలువురు పోటీ పడుతుంటారు. వారు పవన్ సభలకు, సమావేశాలకు హాజరవుతున్నా తమ ప్రాంతంలో ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటారు. జనసేనలో కూడా ఇది కొత్తేమీ కాదు. కానీ నాదెండ్ల ఒకవర్గం వైపే ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే జనసేన పార్టీ కార్యకర్తల నుంచే నాదెండ్ల మనోహర్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మచిలీపట్నంలో ఈ నెల 14న జరగబోయే ఆవిర్భావ సభలో ఇది బయటపడే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News