మేకపాటి స్థానంలో "ఆమె"
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ కు గురైన నేపథ్యంలో ఆయన ప్లేస్ లో మరొకరిని ఉదయగిరికి హైకమాండ నియమించనుంది
ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన నేపథ్యంలో కొత్త నేత ఎవరు వస్తారన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది. అయితే ఇప్పటికే మేకపాటి స్థానంలో సరైన అభ్యర్థిని బరిలోకి దించడానికి జగన్ సిద్ధమయ్యారని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అసంతృప్తిగా ఎక్కువగా ఉందన్న సర్వే నివేదికలు వెల్లడయిన నేపథ్యంలో ఇదివరకే పరిశీలకుడిని నియమించారు. ఉదయగిరి నియోజకవర్గంలో మెట్టుకూరు ధనంజయరెడ్డి నియమితులయ్యారు.
ఇద్దరిని పరిశీలకులుగా...
తొలుత జగన్ ఉదయగిరి నియోజకవర్గానికి కొడవలూరు ధనుంజయరెడ్డిని నియమించారు. ఆ తర్వాత మెట్టుకూరును నియమిస్తూ కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకున్నారు. మెట్టూకూరు ధనంజయరెడ్డి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ గా పనిచేశారు. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి పెత్తనమేందంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పలు మార్లు మీడియా ముందు బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు మేకపాటికి అసంతృప్తి, అసహనం అప్పటి నుంచే ప్రారంభమయిందంటున్నారు. ఈ విషయం తెలిసి వైసీపీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు టిక్కెట్ రాదని అర్థమయిన తర్వాత జగన్ ను కలిసినా ఆయన నోటి నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీ వచ్చిందే కాని, వచ్చే ఎన్నికలలో ఉదయగిరి టిక్కెట్ ఇస్తానని మాత్రం జగన్ హామీ ఇవ్వలేదు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని....
దీంతోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని కొనసాగిస్తారా? అన్నది కూడా సందేహమే. మేకపాటిని ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్థి అవసరం. అయితే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి పేరు వినిపిస్తుంది. వేమిరెడ్డి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఆ కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. సౌమ్యుడు, అందరినీ కలుపుకుని పోయే నేతగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పేరుంది. ప్రశాంతి రెడ్డి అయితేనే సరైన అభ్యర్థి అని జగన్ నిర్ణయించారని తెలిసింది.
టీడీపీ వీక్ అయినా...
త్వరలోనే నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని జగన్ నియమించినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ప్రశాంతిరెడ్డి అయితే మేకపాటి వర్గంలో ఉన్న వారు కూడా మొగ్గు చూపే అవకాశముంది. టీడీపీ ఎవరిని నియమించినా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీకి అంత పట్టులేదు. 1955లో ఈ నియోజకవర్గం ఏర్పడితే ఉపఎన్నికలతో సహా 15 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది రెండుసార్లే. 1999లో విజయరామిరెడ్డి, 2014లో బొల్లినేని వెంకట రామారావులు మాత్రమే గెలిచారు. ఈసారి రెడ్డి సామాజికవర్గానికే చంద్రబాబు టిక్కెట్ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. అదే సమయంలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైపు జగన్ మొగ్గు చూపుతారంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.