హోదా ఖాయమట... ఢిల్లీలో సీన్ మారుతోంది

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ఇంకా యాక్టివ్ గానే ఉంది. బీజేపీ కూడా ఆ దిశగానే ఆలోచిస్తుంది.

Update: 2022-02-13 04:05 GMT

ఒక విషయం మాత్రం స్పష్టమయింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ఇంకా యాక్టివ్ గానే ఉందని భావించాలి. కేంద్ర హోంశాఖతో ఈ విషయానికి సంబంధం ఉన్నా ఇది పూర్తిగా రాజకీయ అంశంగానే చూడాలి. రాజకీయ నిర్ణయంతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మార్చి నెలాఖరుకు ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత?
బీహార్ ఇప్పటికే తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతుంది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పరిస్థితులు అధికారంలో ఉన్న బీజేపీకి ఉన్నాయి. బీహార్ తో పాటు ఏపీకి కూడా ప్రత్యేక హోదాను ఇచ్చే అంశం బీజేపీ పెద్దల పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మాదిరి బీజేపీ పరిస్థితి లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ భవిష్యత్ పై కొంత అవగాహన వస్తుంది.
ప్రీపోల్ అలయన్స్....
వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందే అలయన్స్ ను దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రీపోల్ అలయన్స్ పై బీజేపీ నేతలు దృష్టి పెడతారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రీ పోల్ అలయన్స్ బీజేపీకి అవసరమవుతుందని రాజకీయ విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో గతంలో మాదిరి వన్ సైడ్ ఫలితాలు రావు. బీజేపీి మరోసారి అధికారంలోకి వచ్చిన పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు.
అలా అయితేనే?
అందుకే ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. అయితే ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికైనా తాము మద్దతిస్తామని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే జగన్ ప్రీ పోల్ అలయన్స్ కు హోదా ఇస్తేనే అంగీకరిస్తారు. అందుకే మార్చి నెలాఖరు నాటికి ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశముందని ఢిల్లీలో జోరుగా చర్చ జరుగుతుంది. మరి అదే నిజమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమంటున్నారు.


Tags:    

Similar News