Telangana And Andhra Pradesh : కలయిక ఉత్తుత్తిదేనా? అంత హైప్ వచ్చినా తుస్సు మనిపించారుగా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమై మూడు నెలలు దాటి పోతుంది. ఇప్పటి వరకూ దేనిపైనా పురోగతి లేదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమై మూడు నెలలు దాటి పోతుంది. ఇప్పటి వరకూ దేనిపైనా పురోగతి లేదు. ఆర్భాటంగా నాడు జరిగిన సమావేశం నేటికీ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోయింది. సమస్యలు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. విభజన సమస్యలపై చర్చించడానికి అని ఈ ఏడాది జూన్ 6వ తేదీన ప్రజాభవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక సమస్యలు తీరతాయని అందరూ భావించారు. తర్వాత ముఖ్యమంత్రులు ఎవరూ మాట్లాడకపోయినా, మంత్రులు సమావేశం తర్వాత కార్యాచరణను వివరించారు.
అనేక సమస్యలు...
ప్రధానంగా కృష్ణా జలాల పంపిణీతో పాటు షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించాలనుకున్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వారి మధ్య అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. విద్యుత్తు బకాయీలు చర్చించారన్నారు. షెడ్యూల్ 9 లో ఉన్న 91 సంస్థల విభజనతో పాటు అప్పులు, నగదు నిల్వల పంపిణీపై సమస్య ఒక కొలిక్కి వస్తుందని భావించారు. 23 సంస్థల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటికి పరిష్కారం లభిస్తుందని ఆశించారు. తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి వివాదాలు కూడా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి.
జులై ఆరో తేదీన
అయితే జులై ఆరో తేదీన జరిగిన సమావేశంలో మూడు స్థాయిల్లో సమస్యల పరిష్కరించాలని నిర్ణయించారు.ఒకటి తొలుత వెంటనే ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమై సమస్యలపై చర్చించాలనుకున్నారు. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు అధికారులు ఉంటారని చెప్పారు. ఆ సమావేశంలో సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రుల కమిటీ సమస్యలపై చర్చిస్తుందన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల సమావేశంలో ఈ సమస్యలు కొలిక్కి రాకపోతే చివరకూ మూడవ దశలో ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుందని, అందులో ఈసారి ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లకుండా తామే తమ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పిన ఇరు రాష్ట్రాల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. మరి మూడు నెలలు క్రితం జరిగిన సమావేశం ఉత్తుత్తికేనా అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.