రెండు గ్రూపులు... ఏది బలమైనది?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో రెండు గ్రూపులు బలంగా ఉన్నాయని ఇట్లే తెలుస్తోంది
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో రెండు గ్రూపులు బలంగా ఉన్నాయని ఇట్లే తెలుస్తోంది. ఒకటి టీడీపీ అనుకూల వర్గం కాగా, మరొకటి వైసీపీ సానుకూల వర్గం. పైకి ఈ రెండు వర్గాలు ఆ యా పార్టీలకు మద్దతు తెలపనప్పటికీ పరోక్షంగా వారికి సహకరిస్తున్నారని అనుకోవాలి. కేంద్ర నాయకత్వం వైఖరి వల్లనే ఏపీ బీజేపీ ఇలా తయారయిందంటున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి ఏపీలో కోలుకోవాలంటే ప్రధాన పార్టీలతో పొత్తు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఎంత ప్రయత్నించినా....
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ ఎదుగుదల సాధ్యం కావడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. సుదీర్ఘకాలం టీడీపీతో కలసి నడవడం వల్ల పార్టీ బలపడటం సాధ్యం కాలేదని సోము వీర్రాజు వంటి వారు నేరుగానే విమర్శించారు. తమ పార్టీ ఎదుగుదలను చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన గతంలో నేరుగా విమర్శించారు. అదే సమయంలో టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోము వర్గం వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తుంది.
టీడీపీ అనుకూల...
కానీ ఇటీవల అమిత్ షా సూచనలతో మరో వర్గం బలపడినట్లు కనపడుతుంది. కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నేతలు కీలకంగా మారారు. అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాంటూ ఈ వర్గం అధినాయకత్వాన్ని ఒప్పించగలగింది. దీంతో టీడీపీకి అనుకూలంగా బీజేపీ మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. భవిష‌్యత్ లో టీడీపీతో కలసి నడిచేందుకు అమరావతి దారి చూపిందంటున్నారు.
పొత్తు కుదరడం...
కానీ పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్థన్ రెడ్డి వారు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. కానీ కేంద్ర నాయకత్వం మాత్రం వీరిని పక్కన పెట్టినట్లే కన్పిస్తోంది. టీడీపీ అనుకూల వర్గం ఆర్థికంగా బలంగా ఉండటమూ ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం మిత్ర పక్షంగా ఉన్న జనసేన సయితం టీడీపీతో పొత్తుకు సానుకూలంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చి, ఆయన స్థానంలో మరో వర్గాన్ని నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమరావతి రైతుల ముగింపు సభ పొత్తులను స్పష్టం చేసింది.