నేను ఎవరినీ నమ్మను… జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ను విభజించి కాంగ్రెస్ అన్యాయం చేస్తే… ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, ఈ రెండు పార్టీలను ఇక నమ్మమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2019-03-02 06:43 GMT

ఆంధ్రప్రదేశ్ ను విభజించి కాంగ్రెస్ అన్యాయం చేస్తే… ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, ఈ రెండు పార్టీలను ఇక నమ్మమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే సదస్సులో జగన్ మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలను నమ్మి తమ రాష్ట్రం మోసపోయిందని గుర్తు చేశారు. జాతీయ రాజకీయాలకు సంబంధించి తమ పార్టీ తటస్థంగా ఉంటుందని, ఎవరినీ ఎన్నికల ముందే నమ్మి మోసపోమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదానే ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. ఏపీలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలకు పోతున్నారని, ఆ అవసరం రావొద్దంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే తాము హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలమని పేర్కొన్నారు. తాను రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీకి సమాన దూరంగా ఉన్నానని, ఇద్దరూ రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు.

ప్రజల కష్టాలు తెలుసుకున్నా…

అమరావతి పేరుతో చంద్రబాబు అతిపెద్ద కుంభకోణం చేశారని జగన్ ఆరోపించారు. రాజధాని వచ్చే ప్రాంతంలో చంద్రబాబుతో పాటు అతని బినామీలు పెద్దఎత్తున భూములు రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి మోసం చేశారన్నారు. బ్లాక్ మనీతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు ఆడియో టేపుల్లో దొరికారన్నారు. చంద్రబాబు అవినీతిపై పుస్తకం ప్రచురించిన కాంగ్రెస్ ఎటువంటి విలువలు లేకుండా మూడు నెలల్లోనే టీడీపీతో కలిసిపోయిందని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ లో ఉన్నంతవరకూ తనపై కేసులు లేవని, తాను బయటకు వచ్చాక రాజకీయ దురుద్దేశ్యంతో కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేశాయన్నారు. కేంద్రంతో పోరాడినందుకే తనపై కేసులు పెట్టారని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లుగా ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నానని, అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో మార్పు తెచ్చేలా పాలన ఉంటుందని జగన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News