మళ్లీ అవే వాగ్దానాలను...
గతంలో చేసిన వాగ్దానాలను తాను మళ్లీ చేస్తానని ముందుకు వస్తానని చెప్పటం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని మళ్లీ చెబుతున్నాడన్నారు. బ్యాంకుల్లో పెట్టే బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని ఆయన చేసిన ప్రచారం నిజమయిందా? అని జగన్ ప్రశ్నించారు. 2014లో చేసిన వాగ్దానాలను ఐదేళ్లలో పూర్తి చేయకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రైతులను, డాక్వామహిళలను అందరినీ మోసం చేశారన్నారు. జనాన్ని నమ్మించాలని చంద్రబాబు మరోసారి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఇంటింటికి ఉద్యోగం అన్న చంద్రబాబు ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. అందరినీ మోసం చేసిన చంద్రబాబును నమ్ముతారా? చెప్పినవి అన్నీ అమలు చేసిన తనను నమ్ముతారా? ఆలోచన చేయాలని జగన్ ప్రజలను కోరారు. గతానికి,ఇప్పటికీ ప్రభుత్వంలో, పాలనలో తేడా చూడమని అడుగుతున్నానని అన్నారు.
విద్యకు ప్రాధాన్యత...
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో ఆయన జగనన్న వసతి దీవెన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. పేద విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకుండా, రాజీ లేకుండా ప్రాధాన్యత నిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ పేదలకు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయ పడుతుందని తెలిపారు. తనను తాను నిరూపించుకోవాలన్న తపన, ఆత్మవిశ్వాసాన్ని ఉన్నప్పుడే ప్రపంచం మీ చుట్టూ తిరుగుతుందని విద్యార్థులకు జగన్ తెలిపారు.
ఎంత ఖర్చైనా...?
వివిధ రకాల పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ఈ ప్రభుత్వం వెనకాడదని తెలిపారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలను నిలిపివేయలేదన్నారు. అమ్మవొడి నుంచి వసతి దీవెన వరకూ అన్నీ పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వెళుతున్నామన్నారు. అందరికీ ట్యాబ్‌లు ఇస్తున్నామని, యూనిఫాంలతో పాటు పుస్తకాలు, బూట్లు, సాక్స్ ఇచ్చి ధనవంతులకు తీసిపోని విధంగా పిల్లలను ఉన్నత విద్య అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు రేఖలనే మార్చామని జగన్ తెలిపారు. ఎంత వరకూ చదువుకున్నా.. ఎన్ని కోట్లైనా ప్రభుత్వం భరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు.
933 కోట్ల విడుదల...
నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన ద్వారా 933 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఏటా రెండు విడతల్లో తల్లుల ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థుల చదువుల మీద ప్రభుత్వం ఎంత శ్రద్ధ పెడుతుందో మీకు తెలియంది కాదని అన్నారు. విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకు వచ్చామన్నారు. కరికులమ్ లోనూ మార్పులు తెచ్చామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సత్య నాదెళ్లతో పోటీ పడే విధంగా తీర్చి దిద్దుతామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వానికి పెత్తందారీ ధోరణి అని జగన్ విమర్శించారు. విద్య పట్ల పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.