చంపేస్తాడు.. పోలీసులపైకి నెపం నెట్టేస్తాడు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛనును అందచేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు

Update: 2023-01-03 07:39 GMT

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛనును అందచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పింఛను మొత్తాన్ని తాను పాదయాత్రలో చెప్పినట్లుగానే పెంచుకుంటూ వెళుతున్నానని ఆయన తెలిపారు. ఆదివారమయినా, పండగ రోజయినా సరే ప్రతి నెల ఒకటోతేదీ పింఛనును పంచి పెడుతున్నామని జగన్ అన్నారు. గత ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పింఛను ఇచ్చే వారని, ఇప్పుడు దానిని వచ్చే ఏడాదికి మూడు వేల రూపాయలు చేయబోతున్నామని జగన్ తెలిపారు.

గతంలో మాదిరిగా...
గతంలో మాదిరిగా లంచాలు లేవని, వివక్షత లేదని జగన్ అన్నారు. గతంలో మాదిరి జన్మభూమి కమిటీలు సూచించిన వారికే పథకాలు వచ్చేవని, కానీ మన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా పింఛన్లను మంజూరు చేస్తున్నామని జగన్ అన్నారు. తమ ఆత్మాభిమానం చంపుకుని ఎవరినీ పింఛను కోసం యాచించాల్సిన పని లేదని, అర్హులైన వారికి ప్రభుత్వమే పింఛను మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ స్థాయిలో పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని అని ఆయన అన్నారు.
పుష్కరాల సమయంలో...
రాష్ట్రంలో జరుగుతున్న కుళ్లు రాజకీయాలను చూసి బాధేస్తుందన్నారు. తానే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, తానే ఆయన శవంతో పాటు పార్టీని లాక్కుంటాడని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఎన్టీఆర్ కు దండ వేస్తారని అన్నారు. ప్రజలను వెన్నుపోటు పొడవటం, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం ఈ చంద్రబాబు నైజం అని ఆయన అన్నారు. డ్రోన్ల షాట్లు, వీడియో షూట్ల కోసం ఇదే రాజమండ్రిలో పుష్కరాల సమయంలో 29 మందిని బలి తీసుకున్నాడని జగన్ ఆరోపించారు. అంత మంది చనిపోతే కుంభమేళాలో చనిపోలేదా? అని సిగ్గులేకుండా ప్రశ్నించాడన్నారు. కందుకూరులో తన సభకు తక్కువగా వచ్చే సరికి ఎక్కువగా చూపించేందుకు ఇరుకు సందులో సభను పెట్టి ఎనిమిది మందిని బలి తీసుకున్నాడని మండి పడ్డారు.
తానే మహోన్నత మానవతావాదిగా..
చంపేసిన వ్యక్తే తానే మహోన్నత మానవతా వాదిగా ప్రచారం చేసుకుంటాడని అన్నారు.పేదలను చంపేసి టీడీపీ కోసం త్యాగాలు చేశారంటారని, చనిపోయిన వారిలో కులాలను కూడా చూస్తారన్నారు. రక్తదాహం తీరక, గుంటూరులో కొత్త సంవత్సరం రోజున ముగ్గురు మహిళలను పొట్టనపెట్టుకున్నారని జగన్ ఆరోపించారు. వారం రోజుల నుంచి ప్రచారం చేసుకుని అమాయక మహిళలను బలి తీసుకున్నారని జగన్ అన్నారు. ఇంత జరుగుతున్నా దత్తపుత్రుడు మాత్రం ప్రశ్నించడని జగన్ ఎద్దేవా చేశారు. తాను కారణమయి పోలీసులపైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. అందరినీ మోసం చేసిన ఘన చరిత్ర ఈ చంద్రబాబుది అని జగన్ మండి పడ్డారు. ఎంత చేసినా ఈ పెద్దమనిషి గురించి ఆయన అనుకూల మీడియా రాయదని అన్నారు.


Tags:    

Similar News