ముందే ఈ ఆలోచన ఉంటే....?
ఉద్యోగుల సమ్మెను విరమింప చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అయితే అదే ఈ ఆలోచన ముందు ఉంటే ఇంత రగడ జరిగేది కాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏం సాధించారు? ఉద్యోగుల సమ్మెను విరమింప చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే అదే ఈ ఆలోచన ముందు ఉంటే ఇంత రగడ జరిగేది కాదు. ఉద్యోగుల సమస్యలను జగన్ తొలి నుంచి లైట్ గా తీసుకున్నారు. తాను ఇన్ వాల్వ్ కాకుండా మంత్రులను, అధికారులకు మాత్రమే భాగస్వామ్యులను అయ్యేలా చేశారు. అదే ఇబ్బందిగా మారింది. వారు డీల్ చేయడంలో కొంత తేడా కొట్టడంతోనే చలో విజయవాడ వంటి కార్యక్రమాలను నిర్వహించారు.
చలో విజయవాడతో...
చలో విజయవాడ కార్యక్రమంతో అప్పటి వరకూ జగన్ పట్ల ఉన్న వైఖరిలో మార్పు వచ్చింది. ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియంది కాదు. సమ్మె జరిగితే ఉద్యోగులకు నష్టం జరిగినా అదే స్థాయిలో ప్రభుత్వం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారు అడిగిన గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చాల్సిన అవసరం లేదు. కాకుంటే జగన్ , ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఉన్నతాధికారులు కొంత గ్యాప్ ను సృష్టించారు.
నష్టం జరిగాక...
అది జగన్ తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమ్మె ను నివారించినప్పటికీ ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తి పూర్తిగా తొలిగిపోతుందని అనుకోలేం. వారికి కావాల్సింది వారి ప్రయోజనాలు మాత్రమే. తమ ప్రయోజనాలు కాపాడే ఎవరైనా వారికి అండగా నిలిచేందుకు ఉద్యోగులు నిలుస్తారు. ఇప్పుడు చర్చల ద్వారా పరిష్కారమయినా ఏడాదికి ప్రభుత్వానికి దాదాపు 11 వేల కోట్ల భారం పడింది.
మొదటే ఈ పనిచేసి ఉంటే?
అదే పని తొలి నాళ్లలోనే చేసి ఉంటే ఇంత రచ్చ అయి ఉండేది కాదన్న అభిప్రాయం పార్టీలోనూ వ్యక్తమవుతుంది. నేరుగా జగన్ కల్పించుకుని వీరిని ట్రాక్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. ఇప్పుడు భారం భారంగానే మిగిలింది. ఉద్యోగుల అసంతృప్తి కూడా అసంతృప్తిగానే మిగిలింది. మరి జగన్ ఏం సాధించినట్లు? అందుకే అన్నీ ఆలోచించి, అందరి అభిప్రాయాలను ఏ విషయంలోనైనా తీసుకుంటే ఇటువంటి పరిస్థితులు రావు.