జగన్ యార్కర్ మామూలుగా లేదుగా?
ఫ్యూచర్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకునే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటారన్నది ఆయనను దగ్గరగా చూసే వ్యక్తులు చెప్పే విషయం
జగన్ పారిశ్రామికవేత్తమాత్రమే కాదు. మంచి రాజకీయ వేత్త కూడా. ఫ్యూచర్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకునే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటారన్నది ఆయనను దగ్గరగా చూసే వ్యక్తులు చెప్పే విషయం. జగన్ ఎవరి మాట వినడంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సొంత నిర్ణయమే ఉందంటారు. కానీ అది తప్పు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేశాడన్నది వాస్తవం.
బాబు ఎన్టీఆర్ ను....
చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గత రెండు దశాబ్దాలుగా సైడ్ చేశారు. ఎన్టీఆర్ కు ఈతరం కాకపోయినా పాతతరంలో లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ప్రధానంగా కమ్మ సామాజికవర్గంలో మాత్రమే కాకుండా వెనుకబడిన ముఖ్యంగా బీసీల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఎన్టీఆర్ ను చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న పథ్నాలుగేళ్లలో ఎప్పుడూ పట్టించుకోలేదన్నది ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శ.
కమ్మ వారిపై....
గతంలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలు ఎన్టీఆర్ ను సైడ్ చేయడంపై విమర్శలు చేశారు. వర్థంతి, జయంతి, మహానాడు సందర్భంగా ఆయనకు ఒక పూలదండ వేయడం తప్ప చంద్రబాబు ఎన్టీఆర్ కోసం చేసిందేమీ లేదని, ఆయనను బాబు ఇప్టటికీ విలన్ గానే చూస్తున్నారని పార్టీ నేతలే ఒప్పుకుంటారు. ఇక జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజికవర్గంపై కక్షకు దిగారన్న ఆరోపణలు విన్పించాయి. కమ్మ సామాజికవర్గం వారిని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు విన్పించాయి.
ఎన్టీఆర్ పేరుతో.....
చివరకు జనసేనాని పవన్ కల్యాణ్ సయితం కమ్మ సామాజికవర్గంపై జగన్ ప్రభుత్వం దాడి చేస్తుందని మండి పడ్డారు కూడా. అయితే వాటన్నింటి నుంచి బయటపడేందుకు జగన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమ్మ సామాజికవర్గంలోనే జగన్ ను ఈ విషయంలో మెచ్చుకుంటుండటం గమనార్హం. చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఎన్టీఆర్ పేరు పెట్టడంపై నందమూరి కుటుంబం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. భువనేశ్వరిపై అసెంబ్లీలో జరిగిన ప్రస్తావన, ఆ తర్వాత చంద్రబాబు ఏడ్వడటం వంటి వాటిని జగన్ ఒక్క యార్కర్ తో కొట్టేశారంటున్నారు.