ప్రత్యర్థుల సభల్లో గందరగోళం సృష్టించడం ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కే సాధ్యమన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యే, ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్. తునిలో రైలు దహనానికి జగనే కారణమని ఆయన విమర్శించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తుని తరహాలోనే గుంటూరు నారా హమారా సభలోనూ గందరగోళం సృష్టించాలని చూశారని ఆయన ఆరోపించారు. అధికారంలో లేకుంటేనే ఇలా దౌర్జన్యం చేస్తే అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందనన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లలోపే వస్తాయని, జనసేనకు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఏమాత్రం క్షేత్రస్థాయిలో బలంగా లేని జనసేన ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. జగన్ చేసేది సంకల్ప యాత్ర కాదని, పిక్నిక్ యాత్ర అని ఎద్దేవా చేశారు.