నాయకుడా? కథానాయకుడా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకో కాని ఆవేశానికి లోనవుతుంటారు. ఆలోచన లేకుండా వ్యవహరిస్తుంటారు.

Update: 2022-11-06 03:14 GMT

నాయకుడు అంటే ఎలా ఉండాలి? లీడర్ ఎలా వ్యవహరించాలి? తనను చూసి పది మంది అనుసరించాలి. ఆచరించాలి. చూసే వారికి కూడా హుందాగా ఉండాలి. రాజకీయం సినిమా కాదు. సినిమా రాజకీయం కాదు. రెండింటికీ సంబంధమే ఉండదు. అక్కడ ప్యాకప్ చెప్పేది డైరెక్టర్ అయితే.. ఇక్కడ ప్యాకప్ చెప్పేది ప్రజలు మాత్రమే. కానీ పవన్ కల్యాణ్ ఎందుకో కాని ఆవేశానికి లోనవుతుంటారు. ఆలోచన లేకుండా వ్యవహరిస్తుంటారు. ఒక నాయకుడు అలా వాహనం మీద కూర్చుని వేగంగా ప్రయాణిస్తే చూసే వాళ్లు అదే పద్ధతి అనుసరించరూ?

పిచ్చి అభిమానంతో...
అందులో పవన్ కల్యాణ్ అభిమానులందరూ యువకులే. వెర్రి అభిమానంతో ఊగిపోతారు. వాళ్లు కూడా అలా వాహనాలపై కూర్చుని పవన్ కల్యాణ్ ను అనుసరించి ప్రమాదాల బారిన పడితే ఆ కుటుంబాలు ఏమవుతాయి? అన్న ఆలోచన లేకుండా పవన్ వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి. పవన్ కల్యాణ్ ను ఇప్పటం వెళ్లకుండా అడ్డుకోవడం తప్పే. పోలీసులు అడ్డుకోవడం కూడా ఎవరూ హర్షించరు. ఇప్పటం గ్రామానికి ఎవరైనా వెళ్లొచ్చు. వాహనాలు అనుమతించలేదని పవన్ నడక దారి పట్టారు. అది కూడా సమర్థనీయమే. కానీ వాహనంపైకి ఎక్కి ప్రయాణించడాన్ని ఎవరూ హర్షించరు.

ఆహార్యం.. వేషధారణ కూడా...
రాజకీయ నేత అంటే ఆహార్యం బాగుండాలి. వేషధారణను కూడా ప్రజలు ఆదరించాల్సి ఉంటుంది. పొలిటికల్ లీడర్ కి పర్టిక్యులర్ గా డ్రెస్ కోడ్ లేదు. కానీ డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ యువకుడుగా ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఒక పద్ధతిగా కనిపించారు. తెలంగాణలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి జగన్, టీడీపీ యువనేత నారా లోకేష్ లు కూడా చిన్నవారే. కానీ వారు డ్రెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అది నాయకుడికి ఉండాల్సిన ప్రధమ లక్షణం. అప్పుడే ఏ ఎన్నికలలోనైనా విజయం ఇంటి తలుపు తడుతుంది. రాజకీయ నేత అంటే జీన్ ప్యాంట్ వేయకూడదని కాదు. టీ షర్టులు ధరించకూడదని కానే కాదు. కానీ ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఆదర్శంగా ఉండాలి. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా ఉండాలి. ఎన్నుకుంటే తమను ఆదుకుంటారన్న నమ్మకాన్ని కలిగించాలి. అంతే తప్ప సినిమాల్లో చేసినట్లు ఫైటంగ్ లు, ఛేజింగ్ సీన్లు ఇక్కడ కుదరవంటే కుదరవు. పవన్ కల్యాణ్ అది తెలుసుకుని మలసుకుంటే ఆయన రాజకీయ భవితవ్యానికే మంచిది.


మార్పు తేవాలన్న కసి ఉన్నా...
పవన్ లో ఆవేశం ఉంది. అదే సమయంలో మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. మార్పు తేవాలన్న కసి ఉంది. కానీ ఏం లాభం? ఆయన ఊగిపోతూ అప్పటికప్పడు వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయంగా ఆయన మైనస్ లోకి వెళ్లిపోతున్నారు. పవన్ పరవాలేదులే ఓటరు అనుకునే సమయంలో ఏదో ఒక ఫీట్, ట్వీట్, డైలాగ్ చెప్పి ఉన్నదంతా కోల్పోతున్నారు. మొన్న చెప్పు చూపించి పార్టీ అధినేతగా తప్పు చేశారు. అలాగే ఈరోజు వాహనం మీద కూర్చుని వేగంగా ప్రయాణించి ఆయన ఫ్యాన్స్ ఈలలు, చపట్లు కాసేపు మోగి ఉండవచ్చు కాని భవిష్యత్ లో అదే ఆయనకు మైనస్ గా మారుతుంది. పవన్ ఇప్పటికైనా పవన్ కథానాయకుడిగా కాకుండా నాయకుడిగా వ్యవహరిస్తే ఆయనకే మంచిది.


Tags:    

Similar News