టీడీపీ అడ్డాలో పవన్.. రీజనేంటి?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బాపట్ల జిల్లా పర్చూరుకు రానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బాపట్ల జిల్లా పర్చూకు రానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కౌలు రైతుల భరోసా కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 76 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కల్యాణ లక్ష రూపాయల సాయాన్ని అందజేస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే దిశగా పవన్ ఇటీవల కాలంలో రైతు భరోసా యాత్రలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీ అడ్డాలో....
అయితే ఈసారి పర్చూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలేమిటన్న చర్చ జరుగుతుంది. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. పర్చూరులో దళిత, బీసీ కుటుంబాలు కూడా అధికంగా ఉన్నాయి. పర్చూరులో తన బలాన్ని ముఖ్యంగా టీడీపీకి చూడాలనుకుంటున్నట్లుంది. అందుకే టీడీపీ అడ్డాలో ఆయన తొలిసారి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.
సభ సక్సెస్ కావడానికి...
ఇక్కడ సభ సక్సెస్ చేయడానికి గత కొద్ది రోజులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఇటు గుంటూరు, అటు ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు హాజరయ్యే అవకాశముంది. పొత్తుల కుదురుతాయనుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం కంచుకోటలో జనసేన తన సత్తా చాటాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మినీ మహానాడులతో టీడీపీ బలం చూపుతుండగా, ఇప్పుడు టీడీపీకి తమ పార్టీ శక్తి ఏంటో చూపించాలనుకుంటోంది జనసేన.