పవన్ ఇంత సడెన్ గా ఎందుకో?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ దీక్షకు దిగనున్నారు.;

Update: 2021-12-11 05:17 GMT

ఆందోళనలు చేస్తున్న వారికి సంఘీభావం తెలపడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే సెంటిమెంట్ గా ఉన్న సమస్యపై స్పందించడమూ రాజకీయ నాయకుల లక్షణమే. కానీ ఏదైతే సమస్యకు కారణమవుతుందో దానితోనే చెట్టాపెట్టలేసుకుంటూ తిరుగుతూ నేను దీనిని వ్యతిరేకిస్తున్నాను అంటే వినడానికి ఎవరి చెవిలో పువ్వులు లేవు. అలాగే ఫక్తు రాజకీయం కోసమే అన్నది ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై పవన్ కల్యాణ్ ఒక రోజు దీక్ష కూడా ఈ కోవలోకి చెందిందే.

విశాఖ స్టీల్ ప్లాంట్...
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరించాలని నిర్ణయించింద.ి దీనిని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు గత 300 రోజులకు పైగానే ఆందోళనలు చేస్తున్నారు. ఏపీలోని ప్రతి రాజకీయ పార్టీ ఈ సమస్యపై స్పందించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించ వద్దంటూ ప్రధానికి రెండు లేఖలు రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సయితం కార్మికులకు అండగా నిలిచారు. పవన్ కల్యాణ‌్ ఒకరోజు విశాఖ వెళ్లి అక్కడ ధర్నాలో పాల్గొన్నారు.
అఖిలపక్షం....
అంతవరకూ బాగానే ఉంది. ఇంత సడెన్ గా పవన్ కల్యాణ‌్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయలేదని భావిస్తూ ఆయన దీక్షకు దిగడం వింతగా ఉంది. మిత్రపక్షంగా ఉన్న బీజేపీని తప్పుపట్టకుండా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు పవన్ కల్యాణ్ ఈ దీక్ష చేయడం విమర్శలకు తావిస్తుంది. పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా చూడాలంటే బీజేపీ నేతలతో సంప్రదించాల్సి ఉంటుదని సూచిస్తున్నారు.
బీజేపీ మిత్ర పక్షంగా...
పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా ఏపీకి ప్రత్యేక హోదాపై దీక్షకు దిగి ఉంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయాన్నే పవన్ కల్యాణ్ మర్చిపోయారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టిన పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయలేదన్న సాకుతో దీక్షకు దిగడాన్ని తప్పుపడుతున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ‌్ దీక్ష రాజకీయంగా ఆయనకు ఏ విధమైన లబ్ది చేకూరుతుందో తెలియదు కాని, వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారన్న అపప్రధను ఆయన మూటకట్టుకుంటున్నారు.


Tags:    

Similar News