YSRCP : జగన్ కు గైడెన్స్ ఇచ్చేవాళ్లు ఎవరో కానీ.. చేతులెత్తి మొక్కాల్సిందే సామీ

చంద్రబాబు నాయుడు వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోరు. జగన్ మాత్రం పట్టించుకోరు;

Update: 2025-01-15 06:29 GMT

ఏ అవకాశం వచ్చినా అంది పుచ్చుకోవాలి. అదే రాజకీయం. చంద్రబాబు ను చూసైనా నేర్చుకుంటారా? అంటే అదీ లేదు. ఎందుకంటే నాలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేటి తరం రాజకీయ నేతలు, పార్టీ అగ్రనేతలు ఎన్నో నేర్చుకోవాలి. చంద్రబాబు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దేనినీ వదలిపెట్టరు. ఎటూ ఆయనకు మీడియా మద్దతు ఉంది కాబట్టి ఇక తాను అనుకున్నది చేసుకుని ముందుకు వెళతారు. ప్రజల్లో ఒకరకమైన వ్యతిరేకతను ప్రభుత్వంపై తేవడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరు. గతంలో ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన సమరాన్ని చూసి కూడా నేడు వైసీపీ నేతలు నేర్చుకోలేకపోతున్నారు.

గతంలో చంద్రబాబు...
చంద్రబాబు నాయుడు వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోరు. గతంలో సంక్రాంతి వచ్చిందటే చాలు.. భోగి నాడు నాటి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పండగ చేసుకునే వారు. ప్రభుత్వ ఉత్తర్వులను అందులో దహనం చేసేవారు. ఒక ఏడాది మూడు రాజధానుల ఉత్తర్వులు.. మరొక ఏడాది చెత్త పన్ను ఉత్తర్వులు.. ఇంకొక ఏడాది విద్యుత్తు బిల్లులు.. మరో ఏడాది నాసిరకం మద్యం ఇలా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వెళ్లేవారు. ఇక చివర ఏడాది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ఉత్తర్వులను కూడా భోగిమంటల్లో వేసి దగ్దం చేసి మరీ ప్రజలకు చేరువయ్యారు. అందుకే ఆయనను ప్రజలు ఆదరించారు. సంక్రాంతి నాడు సెంటిమెంట్ ను పట్టించుకోకుండా కేవలం పొలిటికల్ ఆయింట్ మెంట్ ను పూసి మరీ ఆయన జనంలోకి చొచ్చుకెళ్లారు.
ఈ ఏడాది మాత్రం...
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. కానీ సంక్రాంతి నాడు చేసింది శూన్యం. ఎవరింట్లో వారు నేతలు పండగ చేసుకున్నారు తప్పించి జనంలోకి వచ్చి సమస్యలను ప్రస్తావన తేలేకపోయారు. ఇది పూర్తిగా జగన్ వైఫల్యంగానే చూడాలి. ఎందుకంటే కనీసం గతంలో చంద్రబాబును చూసైనా జగన్ నేర్చుకోలేదనిపిస్తుంది. అలాగే జగన్ కు చెప్పేవారు కూడా ఎవరూ లేరనే అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదు. అలాగే విద్యుత్తు బిల్లులను పెంచారు. కానీ జగన్ పార్టీ మాత్రం భోగి మంటలు చేసుకుంది. కానీ పిడకలు వేసి కానిచ్చేసింది. ఇలా ఉంటే ఇక జనంలోకి ఎలా వెళతారు సామీ అని సొంత పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తుంది. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడంలో జగన్ కు మించిన వారు మరొకరు లేరంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News