వెయ్యికోట్ల ప్యాకేజీ అట: ఒకరోజు నా సంపాదన రెండు కోట్లు : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నం జనసేన పదో ఆవిర్భావ సభలో ప్రసంగించారు
మచిలీపట్నంలో జరిగిన పదో ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. మూడు గంటలకు విజయవాడలో బయలుదేరిన పవన్ రాత్రి 9.30 గంటలకు కాని సభాస్థలికి చేరుకోలేకపోయారు. దారిపొడవునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ ను చూసేందుకు పోటీ పడ్డారు. పవన్ సభా వేదిక పైకి వచ్చిన వెంటనే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 2014లో తాను పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగానే ఉన్నానని అన్నారు. అప్పుడు తనకు రాజకీయాలు కూడా పెద్దగా తెలియవని చెప్పారు. తన వెనుక ఎవరూ లేరన్నారు. సగటు మనిషికి మేలు చేయాలన్న తప్ప మరొక ఆలోచనలేదన్నారు. దానికి స్ఫూర్తి స్వాతంత్ర ఉద్యమ నాయకులు అని అన్నారు. కష్టమైనా పార్టీని పదేళ్ల నుంచి నడుపుతున్నానంటే అది మీ అభిమానమేనని అన్నారు.
జనసేన ప్రభుత్వం ఎప్పటికైనా...
ధైర్యంతోనే ముందుకు నడిచానని పవన్ అన్నారు. సమాజానికి ఏదో చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎంతోమంది పార్టీ పెట్టి నడపలేక మధ్యలోనే వదిలేశారన్నారు. ఎవరైనా గెలిచే కొద్దీ బలపడతారని, కానీ మనం దెబ్బపడే కొద్దీ బలోపేతం అవుతున్నామన్నారు. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన ఈరోజు పార్టీ కోసం పులివెందులతో సహా 6,50 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలను సంపాదించుకున్నామని తెలిపారు. పదేళ్లలో మాటలు పడ్డామని, మన్ననలను పొందామని, ఓటములను ఓరిమితో ఎదుర్కొన్నామని అన్నారు. ఈ ఆశతోనే ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చట్టం అంటే ధర్మాన్ని నిలబెట్టడమేనని పవన్ అన్నారు. సగటు మనిషికి మేలు చేయాలనర్న తపనతోనే పార్టీని ఏర్పాటు చేశానని పవన్ తెలిపారు. ఒక్క కులాన్ని గద్దెనెక్కించడానికి రాలేదన్నారు. కులాలకు తాను వ్యతిరేకమన్నారు. అన్ని కులాల వారూ తనకు కావాలన్నారు.
ఐక్యతతోనే సాధన...
కులాల కార్పొరేషన్లు పెట్టడం కొంగ ఎదుట పాయసం పెట్టడం లాంటిదేనని అన్నారు. కాపులు, బీసీలు మెజారిటీలో ఉండి దేహి అనే పరిస్థితుల్లో ఉన్నారంటే కులాల్లో ఐక్యత లేకపోవడమేనని అన్నారు. ఐక్యతతో అన్ని సాధించుకోవచ్చన్నారు. కాపులు, బీసీలకు అండగా ఉంటామని చెప్పారు. ఒక కులం పెత్తనం ఆంధ్రప్రదేశ్ లో ఆగిపోవాలన్నారు. అన్ని కులాలకు ప్రాతినిధ్యం రావాలంటే జనసేన పాలన రావాలని పవన్ అన్నారు. అగ్రకుల పేదలకు అన్యాయమయిపోతన్నామన్న బాధ ఉందన్నారు. అగ్రకుల పేద యువతకు అండగా ఉంటానని చెప్పారు. తనకు వెయ్యి కోట్లు ఆఫర్ ఇచ్చాంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మూర్ఖులే అలా మాట్లాడతారన్నారు. డబ్బులతో మీ అభిమానం సంపాదించగలనా? అని ప్రశ్నించారు. డబ్బులకు తాను ఆశపడే వ్యక్తిని కానని చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సినిమా రోజుకు రెండు కోట్లు తీసుకుంటానని తెలిపారు. డబ్బుకు నా అవసరం లేదన్నారు.