వారాహి కదులుతుందా? లేదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. వారాహి అని వాహనానికి నామకరణం చేసి ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలు నిర్వహించారు. మరో వైపు వరస సినిమాలు చేస్తున్నారు. ఆయన బస్సు యాత్ర రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమవుతుందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. అభిమానులు కూడా పవన్ రాక కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బస్సు రెడీగా ఉంది. రూట్ మ్యాప్ ఇంకా తయారు కాలేదు. ఆయన ఎప్పుడు బస్సు యాత్ర ప్రారంభం చేస్తారన్నది ఇంకా తేదీలు ప్రకటించలేదు.
తేదీని మాత్రం...
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి చిత్తూరు జిల్లా పర్యటనను మరికొద్ది రోజుల్లోనే ముగించనున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకూ బస్సు యాత్రపై స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు, ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం వరసగా సినిమాలకు కొబ్బరి కాయలు కొట్టేస్తున్నారు. బస్సు యాత్ర ఒకసారి ప్రారంభమైతే ఇక ఆపేందుకు వీలులేదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. బస్సు యాత్ర కావడంతో అన్ని నియోజకవర్గాల్లో టచ్ చేసే అవకాశముందని చెబుతున్నారు.
ఎంచుకున్న నియోజకవర్గాలకే...
లేకపోతే కొన్ని ఎంచుకున్న నియోజకవర్గాలకే బస్సు యాత్రను పరిమితం చేయాలన్న ఉద్దేశ్యంలో కూడా జనసేనాని ఉన్నారు. ఎటూ పొత్తులుంటాయి కాబట్టి తమకు బలమున్న నియోజకవర్గాల్లోనే వారాహి వెళ్లేలా రూట్ మ్యాప్ ను రూపొందించాలని భావిస్తున్నారట. ప్రధానంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే వీలుందంటున్నారు. రాయలసీమలో మాత్రం ఎంపిక చేసిన నియోజకవర్గాలకే బస్సు యాత్రను పరిమితం చేస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.
పొత్తుల విషయంలో...
వ్యూహాన్ని తనకు వదిలేయమని చెబుతున్న పవన్ కల్యాణ్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బీజేపీ కూడా పవన్ వెళ్లిపోయినా సరే.. టీడీపీతో కలసి నడవకూడదని నిర్ణయించుకున్నట్లుంది. మానసికంగా కమలం పార్టీ నేతలు అందుకు సిద్ధమయ్యారు. పవన్ కూడా పొత్తులు ఇప్పుడే కాదని, ఎన్నికలకు వారం రోజులు ముందే మాట్లాడతానని చెబుతున్నారు. పవన్ అభిమానుల్లో మాత్రం ముఖ్యమంత్రి పదవి వస్తేనే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. లేకుంటే ఒంటరిగా పోటీ చేయడమే బెటర్ అని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ టీడీపీ కంటే జనసేనకే ఉందని పవన్ అభిమానులు చెబుతున్నారు. అందువల్ల తొందరపడి పొత్తులపై ఒక నిర్ణయానికి రావద్దని కోరుకుంటున్నారు. మరి పవన్ కల్యాణ్ గేర్ మార్చేదెప్పుడో? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.