మరోసారి కరివేపాకు కానున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లోపించింది. ముఖ్యమంత్రి కావాలనుకునే వారు కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది

Update: 2022-03-17 06:36 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లోపించింది. ముఖ్యమంత్రి కావాలనుకునే వారు కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ కు చరిష్మా ఉంది. లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ప్రధాన సామాజికవర్గం కాపులు అండగా నిలుస్తారు. ఏపీలో ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పవన్ కు స్పష్టంగా ఉన్నాయి. అయితే రాజకీయ అవగాహన లేమితో పవన్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరోసారి టీడీపీకి...
2014లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చే సరికి ఆయన మరోమారు టీడీపీకి మద్దతుదారుగా నిలవాలనుకుంటున్నారు. టీడీపీ ఇప్పటికే బలహీనంగా మారింది. చంద్రబాబు నాయకత్వంలోనే అంతో ఇంతో దానికి జవసత్వాలుంటాయి. చంద్రబాబు నాయకత్వం నుంచి తప్పుకుని లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తే అది మరింత దిగజారుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే.
టీడీపీ బలహీన పడితే....
ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీలు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మరోసారి జగన్ అధికారంలోకి వచ్చినా టీడీపీకి నష్టమే కాని పవన్ కల్యాణ్ కు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇటువంటి సమయంలో పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసినా తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడానికి వీలుంటుంది.
ఇప్పుడు కాకపోయినా..?
2024 ఎన్నికల్లో కాకపోయినా 2029 ఎన్నికలు వచ్చేనాటికి పవన్ కల్యాణ్ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలున్నాయి. ఆ అవకాశాన్ని పవన్ చేజేతులా చేజార్చుకుంటున్నారు. పవన్ ది చిన్న వయసే. ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు. సినిమాలకు స్వస్తి చెప్పినా పూర్తి స్థాయి రాజకీయాలు చేసే వీలుంది. టీడీపీని బలహీనపర్చి తాను ఎదగడానికి రాజకీయాలు చేస్తే పవన్ కు భవిష్యత్ ఉంటుంది. లేకపోతే కూరలో కరివేపాకులా పవన్ మిగిలిపోతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పవన్ జగన్ పై వ్యక్తిగత కోపంతో తన రాజకీయ భవిష్యత్ ను తానే నాశనం చేసుకుంటున్నారని జనసేన నేతలే అభిప్రాయపడుతున్నారు. పవన్ ఒకవేళ టీడీపీతో కలసి పొత్తుకు దిగితే అది రాంగ్ స్ట్రాటజీయే అవుతుంది.


Tags:    

Similar News